Tuesday, May 7, 2024

లాస్ట్‌ ఛాన్స్ , డిసెంబర్‌ 4 చివరి వర్క్‌షాపు.. గడపగ గడపకు ప్రొగ్రామ్‌పై ఫోకస్‌

అమరావతి, ఆంధ్రప్రభ : అధికార వైకాపాలో సిట్టింగ్‌లకు డిసెంబర్‌ 4 ఫీవర్‌ వణికిస్తోంది. గడన గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారివారి పనితీరు మెరుగుపర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇచ్చిన గడువు ఆరోజుతో ముగియనుంది. ఇప్పటికే ఒకవైపు ఐప్యాక్‌ టీంతోనూ, మరోవైపు ఢిల్లి సర్వే సంస్థతోనూ స్థానిక పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తన చేతిలో పెట్టుకుని కూర్చున్న సీఎం, ఆ నివేదికలను ఇంటిలిజెన్స్‌ నివేదికలతో క్రాస్‌ చెక్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఎవరి పరిస్థితి ఏంటనేదానిపై ఇప్పుడు సిట్టింగుల్లో ఆందళన నెలకొంది. ఇప్పటికే అక్టోబరులో జరిగిన వర్క్‌షాపులో కొంత మంది పేర్లను నేరుగా చదవివి వినిపించి పరిస్థితి మారాలని సూచించారు.

ఇప్పుడు డిసెంబర్‌ 4వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ చివరి వర్క్‌షాపులో సీఎం జగన్‌ తన వద్ద ఉన్న నివేదికల సారాంశాన్ని బయట పెట్టబోతున్నారని, అందులో తమ పేరు ఉందో లేదో అంటూ టెన్షన్‌ పడుతున్నారు. కొత్త ఏడాది అధికారికంగా వెలువడే ప్రకనటలో తమ భవితవ్యం తేలనుందంటూ ఇప్పటికే కొంత మంది సెటైర్లు వేసుకోవడం పరిపాటిగా మారింది. దీంతో డిసెంబర్‌ 4 వైకాపా సిట్టింగులకు లాస్ట్‌ ఛాన్స్‌గా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో వారి పనితీరే కొలమానంగా టిక్కెట్లు ఇస్తానని చెప్పిన ఆయన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లో మమేకం కావాలంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు.

ఈ ఏడాది మే నెలలో తొలిసారిగా గడప గడపకు మన ప్రభుత్వంపై తొలి వర్క్‌ షాపు నిర్వహించి ఆరు నెలల సమయం ఇస్తున్నానని, ఈలోగా పరిస్థితులు మారకపోతే అభ్యర్ధులనే మార్చేస్తానంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పుడా కీలక ప్రకటన ముగిసే సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 4వ తేదీన ఆయన చెప్పిన ప్రకారం చివరి వర్క్‌ షాప్‌ జరగబోతోంది. ఈ వర్క్‌ షాపులో ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో తేలబోతోంది. ఆమేరకు సిట్టింగులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధానంగా ఒక అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

అదే అభ్యర్థుల మార్పు. వీలైనన్ని నియోజకవర్గాల్లో సిట్టింగుల స్థానాల్లో వేరే వాళ్లను నిలపడానికి ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని స్పష్టం అవుతోంది. దీనికి బోలెడన్ని కారణాలున్నాయి. ఎమ్మెల్యేలుగా చాలా మంది పనితీరు మీద జగన్‌ తను తెప్పించుకున్న రిపోర్టులను, వారి వ్యవహారాలపై తనకు ఉన్న స్పష్టతను బట్టి అభ్యర్థుల మార్పు అంశంపై తీవ్రంగా ఆలోచిస్తూ, అందుకు సంబంధించి కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ సమయాన్ని బట్టి గంట నుండి మూడు గంటల వరకూ సీఎం కేటాయిస్తూ అభ్యర్ధుల పనితీరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement