Monday, May 6, 2024

Delhi | ఈనెల 13న బాధ్యతలు చేపట్టనున్న పురందేశ్వరి.. కొత్త టీమ్ కోసం కసరత్తు షురూ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. మంచి రోజులు చూసుకుని ఈ నెల 13న బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న సమయంలో పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా నుంచి ఫోన్ కాల్ అందుకున్న పురందేశ్వరి యాత్ర ముగించుకుని వెంటనే ఢిల్లీకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే.

మర్యాదపూర్వకంగా జేపీ నడ్డాతో సమావేశమైన ఆమె, బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను మర్యాదపూర్వకంగా కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన నేపథ్యంలో ఆమె స్పందన కోరగా… తాను విజయవాడలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మీడియా సమావేశాన్ని అక్కడే నిర్వహిస్తానని బదులిచ్చారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది.

- Advertisement -

ఇక సమర శంఖమే

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై పదునైన విమర్శలు చేయడం ద్వారా రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వరుస ఢిల్లీ పర్యటనలు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు వంటి అంశాలను సమాఖ్య స్ఫూర్తిలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలుగా మాత్రమే చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలను ఉపేక్షించరాదని అధినాయకత్వం సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వ తప్పిదాలను గుర్తించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించేందుకు రాజకీయానుభవంతో పాటు పాలనలో అనుభవం కల్గి, రాష్ట్రమంతటా పరిచయం ఉన్న నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు నియమించిన అధ్యక్షుల నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోంది. పైగా ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయి. తద్వారా ఈ నేతల ద్వారా ప్రభుత్వాలపై సమర శంఖం పూరించేందుకు కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అసలు పొత్తులే లేకపోయినా సరే ఒంటరిగా పోటీ చేయడానికి తగిన రీతిలో పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడమే ఈ నలుగురికి ఇచ్చిన టాస్క్ అని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదే తరహాలో ఇతర రాష్ట్రాలకు కూడా అధ్యక్షులుగా పాపులారిటీ ఎక్కువగా ఉన్న కేంద్ర మంత్రులను పంపించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి తదనుగుణంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement