Monday, May 6, 2024

Big Story | నవ నిర్మాణ తెలంగాణ.. తొమ్మిదేళ్లలో 300రెట్లు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ నవ శకానికి చేరింది. అచిరకాలంలోనే నవ నిర్మాణాలతో తెలంగాణ సత్తా చాటుతోంది. మొత్తంగా రాష్ట్రంలో 102 లక్షల చదరపు అడుగుల ప్రభుత్వ కార్యాలయాల భవనాలను నిర్మించుకుంది. అ తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 11.73 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో భవనాలు ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 71.55 లక్షల చదరపు అడుగుల వైశాల్యానికి చేరుకున్నాయి. నివాస భవనాలు తెలంగాణ ఏర్పాటుకు ముందు 18.70 లక్షల చదరపు అడుగులు ఉండగా, రాష్ట్ర ఆవిర్బావం తర్వాత 60.90 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నాయి.

మొత్తంగా 30.43 లక్షల చదరపు అడుగులనుంచి రాష్ట్ర ఏర్పాటు తర్వాత 132.45 లక్షల చదరపు అడుగులకు చేరుకోవడం సరికొత్త రికార్డుగా అతి స్వల్ప కాలంతో చేరాయి. రూ. 617 కోట్ల వ్యయంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రారంభించుకున్నది. ఈ భవనంతో తెలంగాణ ప్రభుత్వ పాలన అంతా క్షేత్రస్థాయిలోకి విజయవంతంగా చేరుతూ పాలనా ఫలాలను ప్రజలకు చేరవేస్తోంది. ఏ రాష్ట్రంలో లేని రీతిలో 26 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకున్నది.

రహదారుల నిర్మాణంలోనూ తెలంగాణ సగర్వంగా నిల్చింది. రోడ్ల-భవనాల సేవల్లోనూ ప్రజలకు చేరువైంది. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ శాఖను ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. రోడ్ల నిర్వహణలో సరికొత్త పంథాను అనుసరిస్తోంది. మూడు చీఫ్‌ ఇంజనీర్‌, 10 సివిల్‌ సూపరింటెండ్‌ ఇంజనీర్‌, రెండు ఎలక్ట్రిటల్‌ సూపరింటెంటెండ్‌ ఇంజనీర్‌ పోస్టులతోపాటు 472 కొత్త పోస్టులను ఖరారు చేసింది. 328 కొత్త కార్యాలయాలను ప్రభుత్వం ప్రారంభించుకుంది. తొమ్మిదేళ్లలో 102 లక్షల చదరపు అడుగుల మేర భవనాలను నిర్మించుకున్నది. 8578 కిలోమీటర్ల కొత్త రహదారులను నిర్మించుకుంది. అంబేద్కర్‌ విగ్రహం, అమరుల స్మారక చిహ్నం, రాష్ట్రంలో అన్ని రకాల రహదారులు 1,09,260 కిలోమీటర్లకు చేరుకున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్‌ అద్భుత విజన్‌తోనే సాకారమైంది.

- Advertisement -

ప్రజలు అన్నివిభాగాలు, సేవలు ఒకేచోట పొందేలా జిల్లా అధికారులను ప్రజలు ముఖాముఖి కలిసేందుకు సదుపాయాలు, సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఇందుకు అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో సమగ్ర పాలనా భవనాలను నిర్మించాలని సంకల్పించింది. 21 జిల్లాల్లో రూ.1032 కోట్లతో భవనాల నిర్మాణాలను పూర్తి చేసింది. సత్వర అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రజల్లో పరిపాలన పట్ల నెలకొన్న భావనను మరింత ద్విగుణీకృతం చేయడం, తద్వారా ప్రజలు, అధికారుల్లో ఆత్మవిశ్వాసం పెంచే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా పాలనా యంత్రాంగానికి ప్రజలను దగ్గరగా ఉంచుతూ అభివృద్ధి క్రమంలో ప్రయోజనదారులుగా చేయాలన్న సంకల్పం దిశగా ప్రభుత్వం విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రజలకు ఎంతో వెసులుబాటు కల్పించే కొత్త జిల్లాల ఏర్పాటు సఫలం కావాలంటే ఖచ్చితంగా వారికి అందుబాటులో అన్ని శాఖల కార్యాలయాలు ఉంటూ అధికారులకు దూరంగా ఉన్నామనే భావనను ప్రజలనుంచి ప్రారదోలాలని ప్రభుత్వం నిర్ణయించింది. 21 జిల్లాల్లో ప్రతిపాదించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణాలు నూతన తెలంగాణలో చారిత్రాత్మకంగా నిల్చేలా పూర్తి చేసిన సర్కార్‌, వీటికి అదనంగా మరో 5 పాత జిల్లాల్లో కూడా వీటి నిర్మాణాలను పూర్తి చేసింది.

వీటి విశిష్టతలు…

జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు నివాస గృహాలు…
-కలెక్టర్ల నివాస గృహాలు 21 కేంద్రాల్లో 8వేల చదరపు అడుగుల్లో
-సంయుక్త కలెక్టర్ల నివాస గృహాలు 21 కేంద్రాల్లో 3వేల చదరపు అడుగుల్లో
-జిల్లా రెవెన్యూ అధికారి గృహాలు 21 కేంద్రాల్లో 2500 చదరపు అడుగులు
-ఇతర అధికారుల గృహాలు (148గృహాలు) 1500చదరపు అడుగులు
సుమారు 1.39నుంచి 1.59లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ ప్లస్‌ 2గా డిజైన్‌ చేశారు. కలెక్టరేట్లలో ఒకే ప్రాంగంణంలో 46 శాఖలు కొలువుదీరేలా పూర్తిస్థాయిలో గదులను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement