Wednesday, May 22, 2024

ఆదాయం కోసం పరుగులు! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త భూముల ధరలు

విజయవాడ, ప్రభన్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకునేందుకు అడుగులు వడివడిగా వేస్తోంది. ప్రభుత్వానికి మద్యం తర్వాత రిజిస్ట్రేష్రన్ల శాఖే కనిపిస్తుండడంతో మరోసారి రిజిస్ట్రేష్రన్ల విలువలను భారీగా పెంచాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో మరోసారి ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధమవుతోంది. ఉగాది నుంచి కృష్ణాజిల్లా, ఎన్టీఆర్‌ జిల్లాలుగా ఏర్పాడి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అదే రోజు నుంచి కొత్త జిల్లాల్లో రిజిస్ట్రేష్రన్‌ ఛార్జీల బాదుడు మొదలవనుంది. జాతీయ రహదారులు, వాణిజ్య ప్రాంతాలు, కొత్త జిల్లా ఏర్పాటు కానున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలలో భారీగా భూముల విలువను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కొన్ని రోజులుగా జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ల్రు తమ పరిధిలో రిజిస్ట్రేషన్ల విలువను ఇరవై నుంచి ఇరవై అయిదు శాతానికిపైగా పెంచేలా లెక్కలు సిద్ధం చేశారు. జాతీయ రహదారుల పక్కన ఉన్న భూముల విలువను రెండు, మూడు రెట్లు కూడా పెంచుతూ ప్రతిపాదనలు సిద్దం చేశారు. వీటికి జేసీ ఆమోదముద్ర పడగానే పెంచిన రేట్లు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు రానున్నారు. రెండేళ్ల కిందట ఆస్తుల విలువను యాభై శాతానికిపైగా ప్రభుత్వం పెంచేసింది. ఇప్పుడు ఇంకెంత పెంచుతారనేది తేలాల్సి ఉంది. జాతీయ రహదారుల పక్కన భూముల విలువనుఎకరాకు రూ. 10 లక్షలు ఉన్న దానికి రూ. 30 లక్షలు, రహదారికి కొత లోపల ఉంటే రూ.20 లక్షలు, డిమాండ్‌ ఉన్న ప్రాంతంలో ఎకరాకు కోటి రూపాయల వరకు ప్రతిపాదనలు సిద్దం చేశారు.

విజయవాడ నగరంలోని వాణిజ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారీగా భూముల ధరల పెంపుదలకు శ్రీకారం చుట్టింది. వాణిజ్య ప్రాంతాలకు సమీపంలోని అంతర్గత రోడ్లలో కూడా ధరలను పెంచాలని, ర్యాపిడ్‌ గ్రోత్‌ ఏరియాల్లో భారీగా పెంచాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.. వాణిజ్యపరంగానూ, రియల్‌ పరంగానూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో భూముల ధరలను భారీగా పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ధరల మీద 25 శాతం పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదే జరిగితే ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి రిజిస్ట్రేష్రన్ల ఛార్జీలు తడిచిమోపెడవ నున్నాయి. భూముల విలువ పెంచాలనేదానిపైనా అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎంత శాతం మోత మోగిస్తుందో తేలాల్సి ఉంది. కొందరు సబ్‌రిజిస్ట్రార్ల్ర సమాచారం మేరకు జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఉన్న వాణిజ్య భవనాల విలువలు రెట్టింపయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement