Tuesday, May 14, 2024

ఇన్నోవా కార్ల లబ్ధిదారుల ఎంపిక.. అప్లికేషన్లు ఎక్కువ, వాహనాలు తక్కువ

కృష్ణా, ప్రభన్యూస్ : నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సబ్సిడీపై రుణాలు అందజేస్తున్నాయి. అయితే వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం సబ్సిడీ రుణాల పంపిణి నిలిపివేసింది. ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించడంతో గత రెండేన్నరేళ్లుగా ఎటువంటి సబ్సిడీ రుణాలు పంపిణీ చేయకపోవడంతో వివిధ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం ఇన్నోవా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.20 లక్షలు విలువ చేసే ఇన్నోవా కారును 35 శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు అందజేస్తారు. రెండు శాతం లబ్ధిదారుడు వాట కింద చెల్లిస్తే మిగిలినది రుణం కింద మంజూరు చేస్తారు. ఇన్నోవా కారు ద్వారా ఉపాధి పొందుతూ రుణం మొత్తాన్ని వాయిదా పద్దతులలో చెల్లించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఇన్నోవా కార్లను కొనుగోలు చేసి, ఆ మొత్తం నగదు డీలర్ల‌కు చెల్లించింది. అయితే అప్పట్లో పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ఎంపిక పూర్తి కాకపోవడంతో కొంత మందికే ఇన్నోవా కార్లను అందజేశారు. ఎన్నికల కోడ్‌ రావడంతో మిగిలిన కార్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం సబ్సిడీ పథకాలు అటకేక్కాయి. ప్రభుత్వం ఇన్నోవా డీలర్‌కు కార్ల కొనుగోలు కోసం చెెల్లించిన నగదును వెనుకకు తీసుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆ డీలర్‌ కావాలంటే ఇన్నోవా కార్లను అందజేస్తామని, నగదు ఇవ్వడం జరగదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం జిల్లాకు 12 ఇన్నోవా కార్ల సబ్సిడీపై ఇచ్చేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండేళ్లు తర్వాత ఇన్నోవా కార్లకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి.

జిల్లావ్యాప్తంగా 428 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలో లబ్ధిదారుల ఎంపికకు అధికారులు ఇంటర్వులు నిర్వహించారు. 301 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో అర్హులైన వారు పరిమిత సంఖ్యలో ఉంటే అత్యధిక శాతం మంది బీనామీలే అని ప్రచారం జరిగింది. పరిమిత సంఖ్యలో ఇన్నోవా కార్లు ఉంటే ప్రజాప్రతినిధుల సిఫార్సులు మాత్రం అత్యధిక సంఖ్యలో ఉందని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు కత్తిమీద సాములా మారింది. రోజురోజుకి ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వత్తిళ్లు పెరుగుతుండటంతో పాటు తాము సూచించిన అభ్యర్థులనే ఎంపిక చేయాలంటూ కొంత మంది హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో లబ్ధిదారులు ఎంపిక ఎలా చేయాలంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో పరిమిత యూనిట్లు ఉండటంతో ఎవరినీ సంతృప్తిపరచలేమనే అభిప్రాయంతో ఇన్నోవా కార్ల లబ్ధిదారుల ఎంపికను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement