Sunday, May 19, 2024

Varanasi : నామినేష‌న్ వేసిన ప్ర‌ధాని మోడీ..

అబిజీత్ ముహుర్తంలో మూడోసారి నామినేష‌న్
నామినేష‌న్ ను ప్ర‌తిపాదించిన‌ న‌లుగురు సామాన్యులు
ముందుగా గంగా ఘాట్ లో స్నానం
కాల భైర‌వ ఆల‌యంలో ప్ర‌ధాని పూజ‌లు
జేపీ న‌డ్డా, యోగి ఆదిత్య‌నాథ్, అమిత్ షా,
చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ , రాజ్ నాథ్ సింగ్ హాజ‌రు

లోక్ సభ ఎన్నికల్లో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని వారణాసి నుంచి వరుసగా మూడోసారి నామినేషన్‌ వేశారు. పండితులు నిర్ణయించిన ముహూర్త సమయం ఉదయం 11:40 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్ లో వచ్చిన మోదీ కారు దిగి నడుచుకుంటూ ఒక్కరే లోపలికి వెళ్లారు. రిట‌ర్నింగ్ అధికారికి మోదీ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమైనవేనంటూ మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణపత్రాన్ని చదివి వినిపించారు.

నామినేషన్‌ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు.

- Advertisement -

సామాన్యుల సంత‌కాల‌తో….
మోదీ నామినేష‌న్ ను నాలుగు కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించారు. వారిలో ఇద్దరు ఓబీసీలు, ఒక దళితుడు ఉన్నారు. ప్రతిపాదకుల్లో మరొకరైన ప్రముఖ జ్యోతిష్యుడు, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు.

గంగా ఘాట్ లో స్నానం… కాల‌బైర‌వ ఆల‌యంలో పూజ‌లు…
అంతకుముందు గంగానదిలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని మోదీ ముందుగా దశాశ్వమేథ ఘాట్ లో గాంగానదికి పూజలు చేశారు. అనంతరం నమో ఘాట్ కు చేరుకొని అక్కడ కూడా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కాల భైరవ ఆలయంలో పూజలు నిర్వ‌హించారు..

గంగ‌తో మోదీ అనుబంధం… భావోద్వేగ ట్విట్…
తన నామినేషన్ దాఖలుకు ముందు మోదీ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. వారణాసితో తనకున్న అనుబంధాన్ని ఆ వీడియోలో తెలియజేశారు. 2014 నుంచి వారణాసి నియోజకవర్గంతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.


‘2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ నన్ను ఒడిలోకి తీసుకుంది. ఒక తల్లి తన బిడ్డను ఎలా అక్కున చేర్చుకుంటుందో గత పదేళ్ల కాలంలో నన్ను కాశీ అలా స్వీకరించింది. తల్లితో బిడ్డకు ఉండే బంధం నాకు ఈ నగరంతో ఏర్పడింది. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి’ అంటూ మోదీ చెమర్చిన కళ్లతో చెప్పారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలని, అది తనకు ఇకపైనా కొనసాగుతుందన్నారు.

ప్ర‌త్యేక ముహూర్త స‌మ‌యంలోనే..
దేశంలోని ప్ర‌ముఖ‌ జ్యోతిష్య పండిట్ గణేశ్వర్ శాస్త్రి నిర్ణ‌యించిన ముహుర్త స‌మ‌యం ఉదయం 11:40 గంటలకు ప్రధాని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గంగా సప్తమి, పుష్య నక్షత్రం, సర్వార్థ సిద్ధి యోగం, అభిజీత్ ముహూర్తాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్ రోజున ఉండడం చాలా ప్రత్యేకమైనదనిగా చెప్పవచ్చు. పుష్య నక్షత్రాన్ని అన్ని రాశుల చక్రవర్తిగా చెబుతారు.

కాశీ విద్వత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి ప్రధాని మోదీ జాతకం ప్రకారం ఆయనకు పుష్య నక్షత్రం అనుకూలమని రాంనారాయణ్ ద్వివేది తెలిపారు. ఈ నక్షత్రంలో ఏ పని చేసినా అందులో విజయం ఖాయం. 27రాశుల్లో ఈ రాశికి హిందూ వేద జ్యోతిష్య‌ శాస్త్రంలో ఉత్తమ రాశి హోదా ఇచ్చారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, ఈ నక్షత్రం రోజున చేసే అన్ని పనులు విశేష విజయాన్ని ఇస్తాయని నమ్ముతారు. అలాగే, రాజరిక శక్తి కలయిక జరుతుందని తెలిపారు.

ఆనంద యోగా అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవులు చేసే పనులకు 12 రాశులు , 27 యోగాలకు మంచి సంబంధాలు ఉంటాయంటున్నారు పండితులు. విష్కుంభం నుంచి మొదలుకుని వైధృతి వరకు మొత్తం 27 యోగాలు ఉన్నాయి. ఈ యోగాలు మానవుడు చేసే ప్రతి పనిపై ప్రభావం చూపిస్తాయి. శుభ, అశుభ ప్రభావాలన్నీ ఈ యోగాల్లో ఉంటాయి. అలాగే ఈ రోజున ఆనంద యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఏర్పడిన సమయంలో కొత్త ఉద్యోగం, కొత్త పనులు మొదలు పెట్టేందుకు ఉత్తమంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అలాగే ఈ రోజున జన్మించిన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని నమ్ముతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement