Saturday, April 27, 2024

జపాన్‌పై నన్మదోల్‌ పడగ.. వణికిస్తున్న తుఫాన్‌..

జపాన్‌ను పెను తుపాన్‌ వణికిస్తోంది. నన్మదోల్‌గా పిలిచే ఈ తుఫాన్‌ ఆదివారం నైరుతి జపాన్‌లో తీరాన్ని తాకింది. పెనుగాలులతోపాటు కుండపోత వర్షంతో వాతావరణం భయానకంగా మారింది. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు తుఫాను అధికారికంగా తీరందాటింది. కగోషిమా నగరానికి సమీపంలోకి చేరుకుంది. గంటకు 234 కిలోమీటర్ల (146 మైళ్లు) వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే నైరుతి క్యుషు ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల కంటే తక్కువ సమయంలో 500 మి.మీ వరకు వర్షం కురిసింది అని జపాన్‌ వాతావరణ సంస్థ తెలిపింది.

కగోషిమా, మియాజాకి సహాయక శిబిరాలలో దాదాపు 20వేల మంది తలదాచుకున్నారు. వాతావరణ శాఖ అరుదైన ప్రత్యేక హెచ్చరిక జారీచేసింది. దశాబ్దాలకొకసారి ఇలాంటి భీకర తుపాను హెచ్చరికలు జారీ చేస్తుంటారని స్థానికులు పేర్కొన్నారు. ప్రజల్ని సురక్షిత స్థావరాలకు తరలించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘దయచేసి ప్రమాదకరమైన ప్రదేశాలకు దూరంగా ఉండండి. ఏమాత్రం ప్రమాదం ఉందని భావించినా దయచేసి ఖాళీ చేయండి’ అని ప్రధాని ఫుమియో కిషిడా ట్వీట్‌ చేశారు. ”రాత్రిపూట ఖాళీ చేయడం ప్రమాదకరం. దయచేసి వెలుతురు ఉన్నప్పుడే సురక్షితంగా వెళ్లండి”అని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం నమోదవుతోందని వాతావరణ హెచ్చరిక కేంద్రం అధిపతి హరో కటో అన్నారు.

ఆదివారం సాయంత్రానికి, దాదాపు 200,000 గృహాలకు విద్యుత్‌ సరఫరా స్తంభించిందని అధికారవర్గాలు వెల్లడించాయి. తుఫాను తీరందాటేవరకు రైళ్లు, విమానాలు. ఫెర్రీ రన్‌లు రద్దుచేయబడ్డాయి. పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నాయని కగోషిమాలోని ఇజుమి నగరంలో ఒక అధికారి తెలిపారు. జపాన్‌ ప్రస్తుతం టైఫూన్‌ సీజన్‌లో ఉంది. సంవత్సరానికి దాదాపు 20 తుఫానులను ఎదుర్కొంటుంది, కొండచరియలు విరిగిపడటం లేదా ఆకస్మిక వరదలకు కారణమయ్యే భారీ వర్షాలు సర్వసాధారణం. 2019లో, టైఫూన్‌ #హగిబిస్‌ జపాన్‌ను రగ్బీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వగా, 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2018లో పశ్చిమ జపాన్‌లో వరదల కారణంగా 200 మందికి పైగా మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement