Sunday, April 28, 2024

తైవాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలతో భ‌యాందోళ‌న‌లు

తైవాన్‌ను ఆదివారం భారీ భూకంపం వణించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఆగ్నేయ తైవాన్‌లోని చిషాంగ్‌ టౌన్‌షిప్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. భారీగా ప్రకంపనల కారణంగా రెండంతస్తుల భవనం కూలిపోగా.. ఓ రైలుపట్టాలు తప్పింది. రెండస్తుల బిల్డింగ్‌ కూలినఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యులి గ్రామంలో భవనం కూలిపోయింది. శనివారం అదే ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటి నుండి అనేక ప్రకంపనలు సంభవించాయి.

కానీ ఆదివారం నాటి భూకంపం మరింత బలంగా ఉంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో పౌరులు ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 20 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తైవాన్‌ రైల్వే అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. ఓ రైల్వేస్టేషన్‌లో నిలిచివున్న రైలు, ప్రకంపనల ధాటికి బొమ్మ రైలు మాదిరిగా ఊగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయింది.

భారీ భూకంపం నేపథ్యంలో జపాన్‌ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ద్వీపం క్యుషును ఖాళీ చేయాలని అధికారులు ప్రజలను కోరారు. తైవాన్‌తో అనుబంధంగా ఉన్న ద్వీపంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూకంపం ప్రభావంతో 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశం ఉందని, అలలు ఎగిసిపడే అవకాశం ఉందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. భూకంపం నేపథ్యంలో సహాయం అందించేందుకు సైనికులను మో#హరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సన్‌ లీ ఫాంగ్‌ తెలిపారు. ఫుజియాన్‌, గ్వాంగ్‌డాంగ్‌, జియాంగ్సు, షాంఘై సహా తీర ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయని చైనా భూకంప నెట్‌వర్క్‌ సెంటర్‌ తెలిపింది. తైవాన్‌లో ఇప్పటివరకు సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో 1999 నాటిది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 2,400 మంది మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement