Saturday, April 27, 2024

మోదీ, షా విజయ యాత్ర.. ప్ర‌తిప‌క్షాల‌పై దండ‌యాత్ర‌

(ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ ప్రతినిధి) : ప్రస్తుతం భారత దేశం వికసిత విజయయాత్రలో మునిగి తేలుతోంది. 44 ఏళ్ల కిందట కేవలం మూడు ఎంపీ స్థానాలతో లోక్‌సభలో ప్రవేశించిన బీజేపీ.. ఇప్పుడు దేశ రాజకీయాలను శాసిస్తోంది. గతంలో అధికార పార్టీ నిర్ణయాన్ని ప్రజలకు వదిలేస్తే.. నేడు అదే అధికారాన్ని దారాధతం చేసే స్థాయికి ప్రజలను చేర్చిందని రాజకీయ విశ్లేషకుల భావన.

అవును.. ప్రస్తుతం ప్రజాస్వామ్య రాజకీయ క్రీడ రూపం మారుతుంతోంది. చదరంగం, వైకుంఠపాళి, పులి మేక ఆటల్ని దత్తత చేసుకున్నాయంటే. ఆశ్చర్యం కానేకాదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీ బలాన్ని, బలగాన్నీ నిర్వీర్యం చేయటంతో తొలి విజయం తథ్యం. ఆర్థిక మూలాలను ధ్వంసం చేయాలి. ప్రత్యర్థి జన సైన్యాన్ని నిర్వీర్యం చేయాలి. యుద్ధంలో అచేతన స్థితికి చేర్చాలి. ఇదీ ప్రస్తుతం దేశంలో బీజేపీ నవీన యుద్ధ తంత్రం. ఇదే ప్లాన్‌తో దూసుకెళ్తే.. మోదీ హ్యాట్రిక్ సాధించటం ఖాయం. ఇందులో ఏ మాత్రం అనుమానం అక్కరలేదు.

గెలుపు అప్రతిహాతం కాదు..

కానీ, చదరంగంలో భటులే కీలకం. రాజు బలగాన్ని ముందుకు కదలనీయరు. ఇక వైకుంఠ పాళిలో ఎన్ని నిచ్చెనలు ఎక్కినా ఒక పెద్ద పాము కాచుకు కూర్చుంటుంది. ఆ పామును దాటటం సామాన్యం కాదు. ఇక పులి మేక ఆటలో మేకలు మరీ బలహీనం కాదు. అవి కూడా పక్కా ప్లాన్‌తో పులిని ముందుకు రావివ్వవు. ఈ మూడు క్రీడల్లోనూ.. బలమైన సర్పం చీమల చేతికి చిక్కి జావదే సుమతి అన్నట్టు.. ఆ చీమల్ని ఇక్కడ బీజేపీ రెచ్చగొడుతోంది. ఫలితం ఎలా ఉంటుందో.. ఇక రాజకీయ విశ్లేషుకుల జోస్యం కాసేపు పక్కన పెట్టేద్దాం. ప్రస్తుత జాతీయ రాజకీయ క్రీడల్లో అధికార బీజేపీ ఎత్తుగడలేంటీ? వచ్చే ఫలితాలేంటీ? ఒక్కసారి ఎనాలిసిస్ చేద్దాం.

కేజ్రీవాలే ప్రథమ శత్రువు..

- Advertisement -

ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, ప‌శ్చిమ ఉత్తర‌ప్రదేశ్‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌లో బీజేపీని బ‌లంగా ఎదుర్కోగ‌ల శ‌క్తి ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నాయ‌కుడే లేకుండా చేసి దెబ్బతీయ‌టం అధికార బీజేపీ వ్యూహం. లిక్కర్ స్మామ్ పేరిట అరెస్టు చేయటానికి రెండు నెలలుగా ఈడీ ఆపసోపాలు పడింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేసింది. ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆమ్ ఆద్మీ కార్యకలాపాలకు గండి కొట్టటం ప్రధాన ధ్యేయం. కానీ.. ఎంజరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ రగులుతోంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తమ చీపురును తీసింది. ఒక రకంగా తప్పుడు కేసుల పేరిట బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలను రెచ్చగొట్టిన వేళ.. ఏమి జరుగుద్దో కాస్త సస్పెన్సే.

కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్‌

భార‌త్ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ తెచ్చిన ఊపును పాత‌రేయ‌టం. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆ పార్టీకి లోక్‌స‌భ‌లో 50 సీట్లకు మించి రాకుండా చూడ‌టం ప్రధాన ధ్యేయం. జోడో యాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పుర్జీవనం పోసుకుంది. అధికారంలోకి వచ్చింది. ఇక న్యాయ్ యాత్రతో బలమైన రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పుంజుకోవటం ఖాయం. అందుకే ఆర్థికంగా దెబ్బ తీయటమే లక్ష్యంగా ఎలక్ట్రలర్ బాండ్ల వ్యవహారాన్ని అధికార పార్టీ తెరమీదకు తీసుకు వచ్చింది. కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేయించింది. కానీ, ఈ విషయంతో ప్రజల్లో కాంగ్రెస్ కే సింపతీ పెరుగుతోంది. బీజేపీకి వచ్చిన ఎలక్ట్రోలర్ బాండ్ల సంగతేంటనే ప్రశ్న జనంలో మార్మోగుతోంది.

బెంగాల్‌లో ఈడీ, సీబీఐ దూకుడు

తూర్పు భార‌తంలో మోదీ గ్యాంగ్‌కి కొర‌క‌రాని కొయ్య టీఎంసీని దెబ్బతీయ‌టం. బెంగాల్ సహా ఈశాన్యరాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఎదగటమే బీజేపీ ధ్యేయం. కానీ, బెంగాలీల్లో బీజేపీపై వ్యతిరేకతే గానీ, సానుకూల అభిప్రాయం కనపడటం లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులను ప్రస్తుతం వ్యతిరేకించినా.. ఆ భావజాలం మాత్రం బీజేపీని వ్యతిరేకిస్తోంది. ఎంత దేశభక్తిని ప్రదర్శించినా, బ్రిటిష్ పాలకులకు జనసంఘ్ ఊడిగం చేసిందనే అపవాదు తొలగటం లేదు. ఈడీ, సీబీఐ ఎన్ని కేసులు పెట్టినా.. ఇక్కడ టీఎంసీ తొణకటం లేదు. బెదరటం లేదు. అదరటం లేదు. బలమూ, బలగమూ తగ్గటం లేదు. కానీ సంకీర్ణ రాజకీయాల్లో ఆధిపత్యమే టీఎంసీని ప్రధాన అడ్డంకిగా మారింద‌న్న‌ది వాస్త‌వం.

దక్షిణాదిపైనే గంపెడాశ..

తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి బీజేపీ ఎంతో యత్నిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఉనికిని కాపాడుకుంది. కానీ లోక్ సభ ఎన్నికల్లో మరింత బలం పెంచుకునేందుకు బీజేపీ తపిస్తోంది. ఇక రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో పునర్జీవనమే ధ్యేయంగా పని చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు కలిసి వచ్చాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ సహ కారం కోరుతున్నాయి. దీంతో ఆంధ్రాను పరోక్షంగా శాసిస్తున్న బీజేపీ .. ఆంధ్రాలోని 25 ఎంపీ స్థానాల బలాన్ని తమ ఖాతాలో వేసుకోవటమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఒకవేళ కుదరకపోతే.. ఏపీలో కనీసం 15 స్థానాలు గ్యారెంటీగా గెలుచుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతోంది.

త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో క‌ష్ట‌మే..

త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాలు బీజేపీకి అంతుచిక్కటం లేదు. ఇక్కడ మతం కార్డుతో ముందుకు వస్తే.. ద్రావిడులు కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఎందుకంటే ఉత్తర భారతంలో శ్రీరామ నామంతో దూసుకువెళ్తున్న బీజేపీకి దక్షిణాదిలో మతం కార్డు పని చేయటం లేదు. అందుకే విభజన అస్త్రాన్ని సంధించింది. ఉత్తర, దక్షిణ భారత దేశాల విభజనోద్యమ మంత్రంతో తమిళనాడు, కేరళపై ఉత్తరాంధ్రాలో వ్యతిరేకత, దక్షిణాదిలో మతం పేరిట యగ్నం ప్రారంభించింది. అందులో భాగంగానే ఇటీవ‌ల త‌మిళ‌నాడు, కేరళ ప‌ర్యట‌న‌లో ప్రధాని మోదీ స‌నాత‌నంపై ఆవేదన వ్యక్తం చేశారు. శివ‌సేన‌, ఎన్సీపీలను ముక్కలు చేసి అధికారంలోకి వ‌చ్చిన మ‌హారాష్ట్రలో ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జలు గూబ గుయ్యుమ‌నిపించేందుకు సిద్ధమ‌య్యార‌ని తెలిసి.. ఏనాడో జ‌నం మ‌రిచిపోయిన అరాచ‌క‌వాది రాజ్ ఠాక్రేతో దోస్తీ కట్టారు. కానీ, ఇక్కడ తలరాత మారే ప‌రిస్తితి లేదు.

బీహార్‌లో ఈడీ..సీబీఐ రెడీ

బీహార్‌లో నూక‌లు చెల్లిపోయాయ‌ని తెలిసి నితీశ్‌తో దోస్తీ కట్టి ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెలువాలి. అందుకు ప్రధాన అడ్డంకి ఆర్జేడీ.అందుకే ఆర్జేడీ నేత‌ల‌పై ఈడీ, సీబీఐతో ముప్పేట దాడి జరిపించారు. కానీ, నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఆర్జేడీకి మరింత ప్రాణం పోస్తోంది. గతంలో పొత్తుల కారణంగా సొంత బలాన్ని కోల్పోయిన ఆర్జేడీ ప్రస్తుతం బీహర్లో పుంజుకొంటోంది. ఐతే, బలమైన రాజకీయ ప్రత్యర్థులను అచేతనం చేయటమే ధ్యేయంగా బీజేపీ పావులు కదుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement