Saturday, April 27, 2024

ఐపీఎల్ ఆగిపోవడానికి కారణం ఆ ఒక్కడేనా?

కరోనా కారణంగా ఐపీఎల్ వంటి మెగా టోర్నీని బయో బబుల్ వాతావరణంలో నిర్వహించారు. గత ఏడాది యూఏఈలో బయో బబుల్‌లో నిర్వహించగా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీంతో మరింత ధీమాతో ఈ ఏడాది స్వదేశంలోనే బయోబబుల్‌ ఏర్పాటు చేశారు. కానీ మధ్యలోనే టోర్నీ ఆగిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. బయోబబుల్‌లోకి కరోనా ప్రవేశించడానికి ఐపీఎల్ అధికారుల అలసత్వమనే చెప్పాలి.

బయో బబుల్‌ అంటే అందులో ఉన్న వాళ్లు బయటి వాళ్లను కలవరు. అందులోకి బయటి వాళ్లు రారు. బబుల్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చాకే అనుమతిస్తారు. స‌దరు వ్య‌క్తిని ప్ర‌త్యేక రూంలో ఉంచి వ‌రుస‌గా మూడు టెస్టుల్లో నెగెటివ్ వ‌స్తేనే బుడ‌గ‌లోకి అనుమ‌తిస్తారు. కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఈ నిబంధనలను అతిక్రమించాడని తెలుస్తోంది. అతడు స్కానింగ్ కోసం బయోబబుల్‌ దాటి బయటకు వెళ్లడం, తిరిగి వచ్చాక క్వారంటైన్‌లో ఉండకుండా యథావిధిగా జట్టును కలవడమే అని తెలుస్తోంది.

మే 1న అహ్మదాబాద్‌లో ఉన్న వరుణ్‌ కడుపు నొప్పితే బాధ‌పడుతూ స్కానింగ్‌ కోసం తాను బస చేస్తున్న హోటల్‌ నుంచి బయటికి వెళ్లాడు. ఓ ఆసుపత్రిలో స్కానింగ్‌ పూర్తి చేసుకుని కాసేపట్లోనే తిరిగొచ్చాడు. అయితే ఇలా తప్పనిసరి పరిసితుల్లో ఎవరైనా బబుల్‌ దాటి బయటికి వెళ్లి తిరిగి వస్తే… వారం రోజుల క్వారెంటైన్ త‌ప్ప‌నిస‌రి. వ‌రుస‌గా మూడు రోజుల్లో నెగిటివ్ రిపోర్ట్ రావాల్సిందే. కానీ వరుణ్‌ మాత్రం ఆ షరతును పాటించకుండా నేరుగా సహచరులతో కలిసిపోయాడు. అతను తమిళనాడుకే చెందిన కోల్‌కతా జట్టు సహచరుడు సందీప్‌ వారియర్‌తో కలిసి హోటల్లో భోజనం చేశాడు. తర్వాత ఈ ఇద్దరూ జట్టు బస్సులో అందరితో కలిసి ప్రయాణించి ప్రాక్టీస్‌ కోసం స్టేడియంకు వెళ్ల‌టం, స్టేడియానికి వెళ్లేసరికే తనకు కొంచెం అస్వస్థతగా ఉందని చెప్పడం వల్ల అతడిని విశ్రాంతి కోసం పంపించేశారు. మిగతా జట్టు ప్రాక్టీస్‌కు వెళ్లింది. కానీ రెండు జ‌ట్లు ఒకే చోట ప్రాక్టీస్ చేయ‌కూడ‌దు. కానీ ఆ నిబంధ‌న‌ను కోల్ క‌తా ఆట‌గాళ్లు పాటించ‌లేదు. ఢిల్లీ ఆట‌గాళ్ల‌తో క‌లిసిపోయి… అమిత్ మిశ్రాతో చాలా సేపు మాట్లాడారు. తర్వాత మిశ్రా జట్టుతో కలిసి హోటల్‌ గదికి వెళ్లాడు. అక్కడ అతడికి అస్వస్థతగా అనిపించింది. ఈలోపు సందీప్‌కు కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. వరుణ్‌తో పాటు సందీప్‌, మిశ్రా ఒకరి తర్వాత ఒకరు పరీక్షలకు వెళ్లగా.. ఈ ముగ్గురూ పాజిటివ్‌గా తేలారు. ఇలా త‌న‌కు తెలియ‌కుండానే వ‌రుణ్ చక్రవర్తి చేసిన అజాగ్ర‌త్త ప‌నికి ఏకంగా రూ.వేల కోట్ల ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement