Friday, April 26, 2024

హస్తినలోనే కేసీఆర్ మకాం.. అంతుచిక్కని వ్యూహం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయస్థాయిలో విస్తరించేందుకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ చేరుకున్న ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎవరికీ అంతుచిక్కనిరీతిలో వ్యవహరిస్తున్నారు. తొలి రెండ్రోజులు పార్టీ అద్దె భవనం, నిర్మాణంలో ఉన్న సొంత భవనాలను సందర్శించిన ఆయన, గురు, శుక్రవారాల్లో తన అధికారిక నివాసానికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముందుకొస్తున్నారని, బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పిన కేసీఆర్.. ఢిల్లీలో ఏ పార్టీ నేతలనూ కలవకుండా ఇంటికే పరిమితం కావడంతో ఆయన వ్యూహాలేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు పలు రంగాల ప్రముఖులను కలిసి చర్చలు జరుపుతారని అందరూ భావించారు.

పార్టీకి సంబంధించిన నేతలు ఒకరిద్దరు ఆయన్ను కలవడం మినహా మరెటువంటి రాజకీయ సందడి కనిపించలేదు. ఓవైపు మునుగోడు ఉపఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న సమయంలో కేసీఆర్ ఢిల్లీలో కాలక్షేపం చేయడం వెనుక ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. తాను తీసుకునే నిర్ణయాలకు, వేసే అడుగులకు చాలా కాలం ముందు నుంచే ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేసుకునే అలవాటున్న కేసీఆర్, ఇప్పుడు ఢిల్లీలో మకాం వేయడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement