Saturday, May 18, 2024

బీజేపీలోకి బూర! హస్తినలో మంతనాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన, బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో పోటీచేయాలని భావించినప్పటికీ, టీఆర్ఎస్ నాయకత్వం చివరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మొగ్గు చూపడంతో బూర నర్సయ్య గౌడ్ మనస్తాపానికి గురయ్యారు. నాయకత్వం ఆయనతో మాట్లాడి బుజ్జగించినట్టు కూడా వార్తలొచ్చాయి. ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి పయనమవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో బూర చర్చలు జరిపినట్టు తెలిసింది. అనంతరం ఢిల్లీ చేరుకున్న ఆయన తరుణ్ చుగ్‌తో సమావేశమయ్యారని, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఫోన్లో అందుబాటులో లేరు.

నన్ను కలవలేదు ఇప్పట్లో చేరికలేమీ లేవు – తరుణ్ చుగ్

బూర నర్సయ్య గౌడ్ ఢిల్లీ చేరుకున్నారన్న సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు జేపీ నడ్డా నివాసం వద్ద ఎదురుచూస్తుండగా.. నడ్డాతో సమావేశమై బయటికొచ్చిన తరుణ్ చుగ్ కనిపించారు. బూర నర్సయ్య గౌడ్ చేరికపై ఆయన్ను ప్రశ్నించగా.. తనను ఎవరూ కలవలేదని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై జాతీయాధ్యక్షుడు నడ్డాతో చర్చించేందుకు మాత్రమే వచ్చానని వివరించారు. అయితే పార్టీలో ఎవరైనా, ఎప్పుడైనా చేరవచ్చని అన్నారు. బూర నర్సయ్య గౌడ్ చేరికకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, ఇప్పట్లో ఎలాంటి చేరికలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ క్షేత్రంలో రేపు ఏదైనా జరగవచ్చని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement