Saturday, May 4, 2024

కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలి.. సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టును కోరిన సీబీఐ, ఏపీ ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపల కోర్టులో నిర్వహించాలని కోరుతూ సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని కేసులో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరాయి. సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు గత విచారణ సమయంలోనే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జస్టిస్ ఎం.ఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ కేసు విచారణకు రాగా.. హత్యకేసు ట్రయల్‌ను రాష్ట్రం వెలుపల నిర్వహించాలన్న అంశంపై సీబీఐ, ఏపీ ప్రభుత్వం తమ వైఖరిని చెప్పలేదు. అఫిడవిట్లు దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని సీబీఐ కోరగా.. కౌంటర్లు దాఖలు చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఒకట్రెండులు సమయం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ సందర్భంగా సాక్షులను కల్పిస్తున్న భద్రతపై ధర్మాసనం ప్రశ్నించగా.. తాము 1+1 భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ భద్రత ఎలా సరిపోతుందని ధర్మాసనం సందేహం వెలిబుచ్చగా.. అవసరమైతే ఇంకా పెంచుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌కు తోడు వివేకా బంధువులు మరికొందరు తమ వాదన కూడా వినాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పటికే సునీత దాఖలు చేసిన పిటిషన్‌ సరిపోతుందని, మరెవరి వాదనలు వినాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసులో తమ వాదనలూ వినాలని నిందితుడు శివశంకర్‌రెడ్డి కోరారు. తదుపరి విచారణ రోజు పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement