Friday, April 26, 2024

విషమంగా కాజల్‌ ఆరోగ్య పరిస్థితి..

● జూబ్లిహిల్స్‌ కారు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కాజల్‌
● మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు తరలించిన కారు యజమాని
● చికిత్స జరిపిస్తామంటూ ఆసుపత్రిలో చేరిక
● ఆసుపత్రి బిల్లు చెల్లించకపోవడంతో వైద్యం చేయలేమన్న డాక్టర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జూబ్లిహిల్స్‌లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. గత గురువారం జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45లో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో ఉన్న స్టిక్కర్‌ వాహనం వేగంగా దూసుకొచ్చి అక్కడే ఉన్న ముగ్గురిని ఢీకొట్టగా రెండున్నర నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లి కాజల్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఈ వాహనానికి చెందిన యజమానులు నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు రాత్రి నిమ్స్‌లో చేరిన వీరు రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహీంద్ర యాజమాన్యం యజమాని రూ.5 లక్షలు ఇచ్చి గాయపడ్డ కాజల్‌తో పాటు మిగతా వారిని తమ స్వస్థలమైన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే అహ్మద్‌నగర్‌కు చేరుకున్న కాజల్‌ తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చేరిందని ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో అక్కడి వైద్యులు బతకడం కష్టమని తేల్చినట్టు ఇక్కడి పోలీసులకు సమాచారం అందింది. ఈ వాహనం నడిపిన వ్యక్తితో పాటు ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు కూడా ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి. జూబ్లిహిల్స్‌ పోలీసులు ఇప్పటికే ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో తల, నడుము భాగాల్లో తీవ్రంగా గాయపడిన చిన్నారి తల్లి కాజల్‌ చౌహాన్‌ను ముందుగా అపోలో ఆసుపత్రికి.. అక్కడి నుంచి పంజాగుట్ట నిమ్స్‌కి తరలించినట్టు తెలుస్తోంది. అహ్మద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కాజల్‌ను చేర్పించి వైద్య ఖర్చులు తామే భరిస్తామని నిందితులు ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది సేపటికే వారు కనిపించకుండా పోవడంతో కాజల్‌ వైద్య ఖర్చులు భరించలేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రి కావడంతో డబ్బులు చెల్లిస్తేనే చికిత్స అందిస్తామని డాక్టర్లు చెబుతుండడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఎవరైనా దాతలు ఆదుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement