Wednesday, May 22, 2024

లా కమిషనర్ పరిశీలనలో జమిలి ఎన్నికలు.. కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ భగీరథ్ చౌదరి శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. తరచుగా ఎన్నికల నిర్వహణ కారణంగా తలెత్తుతున్న సమస్యలు, ఒకేసారి లోక్‌సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణ అంశంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని కేంద్ర మంత్రి అన్నారు. ఆ మేరకు రూపొందించిన నివేదికలో స్టాండింగ్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఒకేసారి లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై సాధ్యాసాధ్యాలను లా కమిషన్ అధ్యయనం చేస్తూ రోడ్ మ్యాప్ తయారుచేసే పనిలో నిమగ్నమైందని కేంద్ర మంత్రి వివరించారు.

తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని తేల్చి చెప్పింది. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని, ఇందుకోసం మొత్తం రూ. 7వేల కోట్లకు పైగా ఖర్చయిందని స్టాండింగ్ కమిటీ తేల్చింది. న్యాయశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 79వ నివేదికలో ఈ అంశాలన్నింటినీ పొందుపరిచింది. ఆ నివేదిక ఆధారంగానే ప్రస్తుతం లా కమిషనర్ కసరత్తు మొదలుపెట్టింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement