Friday, May 24, 2024

Big story | జలధార సుంకిశాల.. వందేండ్ల దాకా తాగునీటికి ఢోకా లేదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విశ్వనగరంగా విస్తరిస్తోన్న భాగ్యనగరం భవిష్యత్‌ తాగునీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు సన్నద్ధమైంది. మరోవందసంవత్సరాల వరకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా రూపుదిద్దుకుంటున్న జలాశయాల పనులు శరవేగం పుంజుకుంటున్నాయి. హైదరాబాద్‌ జంటనగరాలకు 111జీఓ ఎత్తివేయడంతో మరో 538 ఎకరాల్లోని 85 గ్రామాలు జతకట్టడంతో భవిష్యత్‌ తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ఎత్తిపోసేందుకు నిర్మిస్తున్న సుంకిశాల రిజర్వాయర్‌ పనుల్లో నీటిపారుదల శాఖ వేగం పెంచింది. దేశంలో ఏ మెట్రోనగరానికి లేనంత తాగునీటి భరోసాను సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ కు కల్పిస్తూ సుంకిశాల జలాశయ నిర్మాణానికి రూ.1450 కోట్లు మంజూరు చేశారు.

మెట్రోనగరంగా రూపుదిద్దికుంటున్న హైదరాబాద్‌ జంటనగరాల్లో ప్రస్తుతం 12లక్షల 56వేల పైచిలుకు మంచినీటి కనెక్షన్స్‌ ఉన్నాయి. 30టీఎంసీ లవరకు తాగునీటి సరఫరా అవసరమవుతుంది. ప్రధానంగా కృష్ణా నుంచి 16.5 టీఎంసీలు, గోదావరి నుంచి 10 టీఎంసీలు, సింగూరు, మంజీర నుంచి మిగతా టీఎంసీల సరఫరా హైదరాబాద్‌ కు ఉంది. అయితే 111 జీఓ ఎత్తివేయడంతో ప్రస్తుతమున్న 650 చదరపు కిలో మీటర్ల హైదరాబాద్‌ కు 538 చదరపుకిలో మీటర్ల భూభాగంలోని జనావాసాలు కలిసిపోతాయి ఈ నేపథ్యంలో ఉత్పన్నమయ్యే తాగునీటి అవసరాలతో పాటుగా భవిష్యత్‌ లో సుమారు వందసంవత్సరాల వరకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం హైదరాబాద్‌కు ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న నాగార్జున సాగర్‌ కృష్ణా జలాలు వేసవిలో 510 అడుగులకు పడిపోతుండటంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు నాగార్జున సాగర్‌ దిగువలోని పుట్టంగండి దగ్గర ప్రత్యేక మోటర్లను ఏర్పాటుచేసి తాగునీటి అవసరాలకు నీటినితోడి సరఫరా చేస్తున్నారు. ఒకవైపు ఎల్లంపల్లి, మరోవైపు కృష్ణా జలాలను పైపులద్వారా కిలోమీటర్ల పరిధిలో సరఫరాచేస్తూ మార్గమధ్యంలో శుద్ధి చేసి తాగునీటిని జలమండలి సరఫరాచేస్తుంది. ఈ పంపిణీ వ్యవస్థ డోలాయమానంగా ఉండటంతో తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కంకణబద్దమైంది. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల పరిధిలోని నాగార్జునసాగర్‌ తీరంలో భారీ ఇన్‌ టెక్‌, సర్జ్‌పూల్‌ నిర్మాణం జరుగుతుంది. ఈ సర్జ్‌పూల్‌ నుంచి నీటి సరఫరాకోసం 18 పంపులు బిగిస్తున్నారు. మరికొద్ది నెల్లో పూర్తి కావస్తున్న ఈ సర్జ్‌ పూల్‌ ను ఆధారంగా చేసుకుని భారీ నీటి గ్రిడ్‌ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ డీపీఆర్‌ సిద్ధం చేస్తుంది.

హైదరాబాద్‌ లో ప్రస్తుతం ఉన్న నీటిపారుదల వ్యవస్థ 1921లోని 4లక్షల 5వేల కుటుంబాలకోసం ఏర్పాటుచేసి 1951 వరకు హుస్సేన్‌ సాగర్‌, ఆతర్వాత గండిపేట. ఉస్మాన్‌ సాగర్‌ నుంచి తాగునీటిని సరఫరాచేశారు. అయితే కాలక్రమేణ నగరం విస్తరించడంతో కృష్ణా, గోదావరి, మంజీర, సింగూరు నుంచి నీటిని సరఫరాచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కు దేశం నుంచి ఉపాధి వలసలు అధికంకావడంతో అధికారిక లెక్కల మేరకు ప్రస్తుతం ఉన్న కోటీ 5 లక్షల జనాభ 2024 నాటికి కోటీ 8 లక్షలు కానుంది. దీనికి తోడు 111 జీఓ ఎత్తివేయడంతో హైదరాబాద్‌ లో కలుస్తున్న జనావాసాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల రిజర్వాయర్‌ తోపాటుగా మరికొన్ని జలాశయాలకు డిపీఆర్‌ లను ప్రభుత్వం రూపొందిస్తోంది.

వంద ఏళ్లకు ప్రణాళిక..

సుంకిశాల రిజర్వాయర్‌ తో పాటుగా మరికొన్ని రిజర్వాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను చేపట్టిందని జలవనరుల అభివృద్ధి శాఖ చైర్మన్‌ ప్రకాష్‌ చెప్పారు. సుంకిశాల నిర్మాణంతో హైదరాబాద్‌ జనాభా 30 కోట్లు పెరిగినా నిరంతర నీటిసరఫరాకు అవకాశాలున్నాయన్నారు. నిత్యం హైదరాబాద్‌కు లక్షలాది మంది బతుకు తెరువుకోసం వస్తుండటంతో జనాభావిపరీతంగా పెరిగిపోతుందని చెప్పారు, జనాభాకు తాగునీరు అందించే బాధ్యతగా ప్రభుత్వం తాగునీటి వనరులను వృద్ధిచేస్తోందని తెలిపారు. సుంకిశాలతో పాటుగా బస్వాపూర్‌,కేశపూర్‌ జలాశయాలు నిర్మించి ఓఆర్‌ఆర్‌ దగ్గర భారీ వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుచేసి నిరంతర సాగునీరు సరఫరాచేసేందుకు ప్రభుత్వం డీపీఆర్‌ రూపొందిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement