Tuesday, May 14, 2024

విశాఖ జూలో మరో జిరాఫీ అనారోగ్యం.. వైద్యం అందిస్తున్న వైద్యులు

ఆరిలోవ (విశాఖపట్నం), ప్రభన్యూస్‌ : విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కులో మూగజీవాల అనారోగ్య పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రెండు నెలల వ్యవధిలో ఒక జీబ్రా, ఒక తెల్ల పులి, ఒక జిరాఫీ మృతి చెందిన ఘటనలు పాఠకులకు విదితమే. ఇప్పటికే జూలో ఉన్న జత జిరాఫీలలో మే అని పిలవబడే ఆడ జిరాఫీ అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. తాజాగా బెకాన్‌గా పిలుస్తున్న మగ జిరాఫీ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.

ఈ నేపథ్యంలో జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా అప్రమత్తమై జిరాఫీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిరాఫీకి అనారోగ్య లక్షణాలు కనపడటంతో వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక వైద్య నిపుణులను తీసుకొచ్చి వైద్యం చేస్తున్నట్లు క్యూరేటర్‌ సలారియా తెలియజేసారు. అయితే జిరాఫీ ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్య సహాయం అందిస్తున్నట్లు ఆమె తెలియజేసారు.

- Advertisement -

కాగా ఇప్పటి వరాకూ సుదీర్ఘ కాలంగా జూ వైద్యునిగా పనిచేసిన డా.శ్రీనివాస్‌ తన విదులనుండి రిలీవ్‌ కావడంతో జూ వన్యప్రాణుల పర్యవేక్షణ కు సీనియర్‌ వైద్యుడు కరువయ్యారు. ఇతర ప్రాంతాల నుండి వైద్యులను తీసుకుని వచ్చి జిరాఫీకి వైద్యం అందిస్తున్న పరిస్థితులు విశాఖ జూలో నెలకొన్నాయి.వెంటనే ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ఒక సీనియర్‌ వైద్యున్ని విశాఖ జూకు నియమించి వన్యప్రాణుల ప్రాణాలను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement