Thursday, May 30, 2024

Profit – రికార్డ్ స్థాయిలో ప్రభుత్వ బ్యాంకులకు లాభాల పంట

ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేశాయి. మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం రూ.1.4 లక్షల కోట్లు దాటింది. మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకులు నికర లాభం అంతకుముందు ఏడాది రూ.1,04,649 కోట్లు లాభాన్ని ఆర్జించగా.. 35 శాతం వృద్ధితో రూ.1,41,203 కోట్ల నికర లాభం నమోదైంది. ఇందులో బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ వాటానే 40 శాతం కావడం గమనార్హం.

ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ రూ.61,077 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది వచ్చిన లాభం రూ.50,232 కోట్లతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లాభం ఏకంగా 228 శాతం వృద్ధి చెందింది. సమీక్షిస్తున్న ఆర్థిక సంవత్సరంలో రూ.8,245 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. యూనియన్‌ బ్యాంక్‌ 62 శాతం వృద్ధితో రూ.13,649 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ 61 శాతం వృద్ధితో రూ.2,549 కోట్ల లాభాన్ని ప్రకటించాయి.

- Advertisement -

బ్యాంక్‌ ఆఫ్ ఇండియా 50 శాతం వృద్ధితో రూ.6,318 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 56 శాతం వృద్ధితో రూ.4,055 కోట్లు, ఇండియా బ్యాంక్‌ 53 శాతం వృద్ధితో రూ.8,063 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. 12 బ్యాంకుల్లో పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఒక్కటే లాభాల్లో క్షీణత నమోదైంది. ఆ బ్యాంక్‌ లాభం 55 శాతం క్షీణించి రూ.595 కోట్లుగా నమోదైంది. ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (రూ.17,788 కోట్లు), కెనరా బ్యాంక్‌ (రూ. 14,554 కోట్లు) రూ.10వేల కోట్లకు పైగా నికర లాభాన్ని ప్రకటించాయి.

ఫలించిన ప్రభుత్వ చర్యలు

గతంతో పోలిస్తే ప్రభుత్వరంగ బ్యాంకులు కోలుకున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.85,390 కోట్ల భారీ నష్టాల నుంచి ఈ స్థాయికి చేరుకున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. ప్రధాని మోదీ, మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్‌ జైట్లీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ముఖ్యంగా 2016-17 నుంచి 2020-21 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల పునరుజ్జీవానికి ప్రభుత్వం రూ.3,10,997 కోట్లను ప్రభుత్వం జొప్పించింది. దీంతో బ్యాంకులు తమ కాళ్లపై నిలబడగలిగాయి. పాలనాపరంగా క్రమశిక్షణ మెరుగైంది. ప్రభుత్వ బ్యాంకులు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement