Friday, April 26, 2024

Delhi: శాసన వ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమే.. 3 రాజధానులపై హైకోర్టు తీర్పును తప్పుబట్టిన ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. అమరావతే రాజధాని ఉండాలంటూ హైకోర్టు తీర్పునివ్వడం శాసన వ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ తీర్పుపై తక్షణమే స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెహఫూజ్ నజ్కీ పిటిషన్ దాఖలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పిటిషన్‌లో పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత.. మళ్లీ ఆ చట్టంపై ఆలోచన చేస్తామని చెప్పిన తర్వాత.. వచ్చే చట్టం ఎలా ఉంటుందో తెలియకుండానే తీర్పు ఇవ్వడం సమంజసమే కాదని పిటిషన్‌లో స్పష్టం చేసింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, కమిటీ సూచనకు సంబంధం లేకుండా రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని గత ప్రభుత్వం నిర్థారించిందని తెలిపింది. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. మొత్తంగా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ఆరోపించింది. హైకోర్టు తీర్పునిచ్చిన కొన్ని నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

హైకోర్టు తీర్పులో ఏముంది?
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పునిచ్చింది. సీఆర్‌డీఏ చట్టప్రకారమే వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని కోసం భూములిచ్చి రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని కూడా సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాలని తీర్పును వెలువరించింది.

రిట్ ఆఫ్ మాండమస్
రాజధానిపై చట్టాలు చేసే అధికారం లేదంటూ రిట్ ఆఫ్ మాండమస్ ఇస్తున్నామని హైకోర్టు ఆనాడు తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు తాము చట్ట పరంగా చేయాల్సిన తప్పనిసరి విధులను చేయకపోతే.. ఆ పనులను చేసి తీరాల్సిందే అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరి ఆదేశాలను రిట్ ఆఫ్ మాండమస్ అంటారు. మాండమస్ అంటే చేసి తీరాల్సిందే అని అర్థం. అయితే మాండమస్ అనేది అన్ని సందర్భాల్లోనూ కోర్టు ఇవ్వదు. చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉన్నత న్యాయ స్థానాలు ఈ అత్యున్నత అధికారాన్ని ఉపయోగిస్తాయి. మాండమస్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుల చిట్టచివరి అస్త్రంగా చెప్పవచ్చు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మాండమస్‌ను జారీ చేస్తాయి.

- Advertisement -

చట్టాలు చేసే అధికారాన్ని హరించడమే
ఇలా రిట్ ఆఫ్ మాండమస్ ఇవ్వడాన్ని శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. చట్టాలు చేయడానికి శాసన వ్యవస్థకు రాజ్యాంగం అన్ని అధికారాలు ఇచ్చిందని, అలాంటప్పుడు శాసన వ్యవస్థ అధికారాల్లో న్యాయవ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నిస్తోంది. హైకోర్టు తీర్పుపై దాదాపు 6 నెలల పాటు లోతుగా అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement