Sunday, April 28, 2024

IND vs PAK: పబ్స్, ఫంక్షన్ హాళ్లలో బిగ్ స్క్రీన్స్.. అభిమానుల సందడే సందడి

ఇవాళ ప్రపంచకప్‌లో భారత్‌ vs పాకిస్థాన్‌ తలపడే మ్యాచ్‌ కోసం నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య మ్యాచ్‌ అంటే ప్రతి బంతి ఉత్కంఠే. నాలుగు గోడల మధ్య కంటే డీజే హోరులో భారీ తెరపై వీక్షించాలని ఊవ్విళ్లుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి మొదలయ్యే మ్యాచ్‌ కోసం నగరంలోని పలు హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లలో భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రికెట్‌ అభిమానులు ప్రపంచకప్‌ మొదలైనప్పటి నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌ కోసం ఎంతోముందుగానే టికెట్లు బుక్‌ చేసుకున్న నగరంలోని క్రికెట్‌ అభిమానులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వీరిలో పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. వీరంతా స్టేడియంలో తళుక్కున మెరవనున్నారు. విద్యార్థులకు సెలవులు రావడంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. స్నేహితులతో కలిసి చిల్‌ అవుతూ మ్యాచ్‌ వీక్షించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.

వీరికి మరింత వినోదం పంచేందుకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. హైటెక్స్‌లో ఇప్పటివరకు డిసెంబరు 31 వేడుకలను చూశాం. ఈసారి భారత్‌ vs పాక్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారంతో పాటూ డీజేతో జోష్‌ను మరింత పెంచనున్నారు. విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి మ్యాచ్‌ వీక్షించేందుకు పెద్దలు సిద్ధమయ్యారు. గేటెడ్‌ కమ్యూనిటీలో భారీ తెరలపై వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌ గెలిస్తే దసరా నవరాత్రుల్లోనే దీపావళి టపాసుల మోత మెగించేందుకు అభిమానులు సిద్ధం చేసి పెట్టుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement