Friday, May 3, 2024

Hyderabad – గ్రూప్ 2 అభ్య‌ర్ధి ఆత్మ‌హ‌త్య‌… న్యాయం కోరుతూ రోడ్డుపై నేత‌ల బైఠాయింపు… లాఠీఛార్జీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. గ్రూప్2 పరీక్ష వాయిదా పడడంతో మనస్థాపం చెందిన మర్రి ప్రవళిక (23) అనే విద్యార్థిని హైదరాబాదులోని అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా బిక్కాజి పల్లికి చెందిన ప్రవళిక.. అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ గ్రూప్ టు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది.
శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఆ తర్వాత గదికి వచ్చిన తోటి విద్యార్థులు ఇది గమనించి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఈ విషయం తెలిసి పెద్ద ఎత్తున గ్రూప్ 2 అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులను అడ్డుకుని, పరీక్ష వాయిదా పడడం వల్లే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో, మృతదేహం అర్ధరాత్రి వరకు హాస్టల్లోనే ఉండిపోయింది. విషయం తెలిసి బిజెపి ఎంపీ లక్ష్మణ్, బిజెపి నాయకురాలు బండారు విజయలక్ష్మి, సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని అభ్యర్థులతో పాటు నిరసన తెలిపారు. ఇక చనిపోయే ముందు ప్రవళిక రాసిన సూసైడ్ నోట్ వెలుగు చూసింది. ఇది ఇప్పుడు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది.

అందులో.. ‘అమ్మా నన్ను క్షమించు.. నేను నష్ట జాతకురాలిని, నావల్ల మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు. ఏడవద్దు. జాగ్రత్తగా ఉండండి. నా అదృష్టం కొద్ది మీకు కూతురుగా పుట్టాను.. నన్ను కాళ్లు కందకుండా చూసుకున్నారు. కానీ మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్నెవరూ క్షమించరు.. మీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా అమ్మా.. నాన్న జాగ్రత్త’ అంటూ రాసింది. ప్రవళిక ఆధార్ కార్డు మీద ఉన్న వివరాల ప్రకారం తండ్రి లింగయ్య అని మాత్రమే సమాచారం ఉంది మిగతా కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది.

ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి వరకు రోడ్డు పైనే బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు ససేమిరా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -

వీరి నిరసనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. పోలీసులు ట్రాఫిక్ ను మళ్ళించి అభ్యర్థులను చదరగొట్టడానికి ప్రయత్నించారు. రైమ్స్ అండ్ సిట్ సంయుక్త పోలీసు కమిషనర్ గజరావు భూపాల్ చిక్కడపల్లి ఏసీబీ యాదగిరి సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసిపి రత్నం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లాఠీచార్జి చేయడంతో రెచ్చిపోయిన అభ్యర్థులు పోలీసుల మీద రాళ్లు విసిరారు. అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమనే.. ప్రవళిక మృతదేహాన్ని అంబులెన్స్ లో పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు సిఆర్పిఎఫ్ దళాలను రంగంలోకి దింపారు.శనివారం ఉదయం ప్రవళిక మృతదేహాన్ని బిక్కాజిపల్లికి తరలించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

లాఠీఛార్జీని ఖండించిన ఈట‌ల

నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో స‌హ ఇత‌ర నేత‌ల‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షలు రద్దు కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్‌ అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా వారికి నైతిక స్థయిర్యాన్ని ఇవ్వడం బీజేపీ బాధ్యత అని, అందులో భాగంగా వారి వద్దకు వెళ్లిన వారిపై లాఠీ చార్జీ చేయడం తగదని అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు బయటకు రావాలని కోరారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని కోరారు. మంచి రోజులు వస్తాయని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యత తీసుకుంటామని ఈటల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement