Sunday, May 12, 2024

ఎన్నికలకు భయపడను.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ నామినేషన్‌

ఆగస్ట్‌ 6వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గరెట్‌అల్వా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మనందరం ఇండియాలోని పలు మూలల నుంచి వచ్చాం. రకరకాల భాషలు మాట్లాడుతున్నాం, విభిన్న మతాలు, ఆచారాలు పాటిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని అన్నారు. గెలుపు, ఓటములు జీవితంలో ఒక భాగమని అందువల్ల, జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తాను భయపడటం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే, శక్తివంతమైన, ఐక్య భారత్‌ నిర్మాణానికి, ప్రజలను దగ్గర చేయడానికి పార్లమెంటేరియన్లు సహాయ పడతారని మార్గరెట్‌ అల్వా అభిప్రాయ పడ్డారు. విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు అల్వా ప్రకటించారు.

యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంలో దేశ సమగ్రత కోసమే పాటుపడ్డానని ఆమె అన్నారు. పార్టీలకు అతీతంగా ఉభయసభల సభ్యులు నాపై నమ్మకం, విశ్వాసం, ప్రేమతో ఓటేస్తారని నమ్ముతున్నట్లు అల్వా ప్రకటించారు. 50 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో గడిపాను. రాజ్యసభ, లోక్‌సభల్లో 30 ఏళ్ల పాటు సభ్యురాలిగా ఉన్నాను. కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా, ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధిగా వ్యవహరించాను. మహిళల హక్కుల కోసం పోరాడాను. అణగారిన వర్గాల కోసం పోరాడానని ఆమె వెల్లడించారు. ప్రజాస్వామ్య పునాదులను పటిష్ట పరిచేందుకు, సంస్థలను బలోపేతం చేయడానికి మరోసారి పోరాటానికి సిద్ధమైనట్లు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అల్వా ప్రకటించారు. అల్వా నామినేషన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement