Sunday, May 19, 2024

కేంద్ర విధానాలపై టీఆర్‌ఎస్ నిరసన.. గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో గళమెత్తుతామని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు తేల్చి చెప్పారు. ద్రవ్యోల్బణం, జీఎస్టీ, పెట్రో, గ్యాస్ ధరలను నిరసిస్తూ మంగళవారం ఉభయ సభలు ప్రారంభం కాగానే విపక్షాలతో కలిసి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలు మొదలవగానే టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసన గళాన్ని మరింతగా పెంచారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉదయం వాయిదా పడి, తిరిగి మధ్యాహ్నం 2గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే మళ్లీ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేస్తూ ప్రజా సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో లోక్‌సభను బుధవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్ సురేశ్ రెడ్డి , మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేష్ నేత, పోతుగంటి రాములు, పసుమారి దయాకర్, మన్నే శ్రీనివాసరెడ్డి, దివకొండ దామోదరరావు, గడ్డం రంజిత్ రెడ్డి , బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథిరెడ్డి, వద్ధిరాజు రవిచంద్ర తదితరులు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఉభయ సభల్లో తక్షణమే ప్రజా సమస్యలను చర్చించాలని నినాదాలు చేశారు.

సభల వాయిదాపై అభ్యంతరం : నామా నాగేశ్వరరావు
ఎంపీ నామా నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ… ఇది ఆరంభం మాత్రమేనని, అసలు పోరాటం ముందుందని అన్నారు. ప్రజా సమస్యలను చర్చించకుండా సభను వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణలోని వరదలు కేంద్ర పాలకులకు , బీజేపీ నాయకులకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలు మీద విపరీతమైన భారాలు మోపుతూ కష్టాల పాలు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం, ఐటీ , అన్నీ రంగాల్లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని, ఇది చూసి ఒర్వలేక కేంద్ర పాలకులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింతగా దిగజారి ఆందోళనకు గురి చేస్తోందన్నారు.

అనంతరం ఎంపీలు తెలంగాణ భవన్‌కు చేరుకుని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీద్దామని పార్లమెంటుకు వస్తే సభ జరగకుండా వాయిదా వేస్తున్నారని విమర్శించారు. గతంలో వరి ధాన్యం, బాయిల్డ్ రైస్ విషయంలో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. ధాన్యం విషయంలో తమ మాటలు నమ్మకపోయినా, ప్రత్యక్షంగా పర్యటించి వచ్చిన గవర్నర్ తమిళి సైనైనా అడిగి తెలుసుకోవచ్చని సూచించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు, పురోగమిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని రంజిత్ ఆరోపించారు. భారత్‌తో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ అనేక రెట్లు వృద్ధి చెందిందని తెలిపారు. భారత్ ఏం తప్పు చేసింది? ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుతోంతో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం విషయంలో కేంద్రం ఒకలా వ్యవహరిస్తూ, రాష్ట్రాలకు పరిమితులు విధిస్తోందని విమర్శించారు. రుణాల ద్వారా సేకరించిన సొమ్మును క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం మాత్రమే ఖర్చు చేశామన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎరువుల సబ్సిడీకి కూడా ఈ సొమ్మును వినియోగించిందని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఆదర్శ రాష్ట్రమంటూ మెచ్చుకుని ఇప్పుడేమో ఏకంగా 21 బృందాలను పంపించి పథకం సరిగా అమలు జరగడం లేదని అంటున్నారని రంజిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని తుగ్గలో తొక్కిన ఘనత మోడీ సర్కారుదని మండిపడ్డారు. నియంతృత్వానికి మరో పేరుగా మోడీ పాలన జరుగుతోందని, ప్రజాస్వామ్యం గొంతు నొక్కేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు భావజాలాల మధ్య జరిగాయని వెంకటేష్ నేత చెప్పుకొచ్చారు. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య ఈ ఎన్నికలు జరిగాయని స్పష్టం చేశారు. తెలంగాణకు ఇస్తున్న నిధుల విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించేలా తప్పుడు లెక్కలు చెబుతున్నారని, తెలంగాణను దేశంలో అంతర్భాగంగా చూడడం లేదని, అప్పుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం ఎంత అప్పు తీసుకోవాలో చెబుతున్న కేంద్రం నిర్దేశించిన ప్రకారం పరిమితి విధించాక మళ్లీ అందులో కోతలు విధిస్తోందని ఎంపీ వెంకటేష్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement