Sunday, April 28, 2024

కొత్త మెడికల్‌ కాలేజీల్లో బోధనా సిబ్బంది భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత తీరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగ బలోపేతం కోసం ఇటీవల 14 మెడికల్‌ కాలేజీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 8 మెడికల్‌ కాలేజీల నిర్మాణం ముగింపు దశకు వచ్చింది. 2022-23 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించబోయే నూతన మెడికల్‌ కాలేజీల్లో వివిధ స్థాయిల బోధనా సిబ్బంది నియామకం కోసం కాంట్రాక్టు పద్దతిన 645 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 120 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను మంజూరు చేసింది. సిబ్బంది నియామకానికి ఆయా మెడికల్‌ కాలేజీ స్థాయిలో ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆ జిల్లా కలెక్టర్‌ లేదా అడిషనల్‌ కలెక్టర్‌ నేతృత్వం వహిస్తుండగా… మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌/ డైరెక్టర్‌, కాలేజీకి అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌ సభ్యులుగా ఉంటారు. మెడికల్‌ కాలేజీలో తరగతుల నిర్వహణకు కచ్చితంగా దాదాపు 11 డిపార్ట్‌మెంట్లు (జనరల్‌ మెడిసన్‌, కార్డియాలజీ, అనస్థిషియా) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. త్రిసభ్య రిక్రూట్‌మెంట్‌ కమిటీ ఆయా విభాగాలకు అవసరాన్ని బట్టి సిబ్బందిని, విభాగాధిపతులను నియమిస్తుందని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మంచిర్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, భద్రాద్రి-కొత్తగూడెం, జగిత్యాల, రామగుండం వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.

కొత్తగా తరగతులు ప్రారంభం కాబోయే ఈ మెడికల్‌ కాలేజీల్లో కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున 1350 కన్వీనర్‌ కోటా సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఈ మెడికల్‌ కాలేజీల్లో జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తనిఖీ చేసింది. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు గల వసతులపై దాదాపు సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మిగతా చిన్నా, చితక పనులను ఆర్‌అండ్‌బీశాఖ, రాష్ట్ర వైద్య విద్యా విభాగం సమన్వయంతో పూర్తి చేశాయి. ఈ కళాశాలల్లో భవన నిర్మాణంతోపాటు వివిధ విభాగాల ఏర్పాటు, ల్యాబ్‌లు, తరగతి గదులు, ఫర్నీచర్‌, బోధనా ఉపకరణాలు తదితరాలు అన్నీ సమకూర్చినట్లు ఇరు శాఖల అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 2022-23 జులై నుంచి ఈ కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే ఈ మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఆయా జిల్లా కేంద్రాల్లోని జిల్లా ఆస్పత్రులను 330 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement