Friday, April 26, 2024

హెల్త్‌ బూమ్‌! వేగంగా అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణం..

హైదరాబాద్ : తన కృషి, పట్టుదలతో ప్రత్యేక తెలంగాణ సాధించిన కేసీఆర్‌ బంగారు తెలంగాణా ఆవిష్కరణ దిశగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నీటిపారుదల, మౌలిక సదుపాయాల రంగాల్ని పెద్దెత్తున అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచారు. ఇప్పుడు ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా అడుగులేస్తున్నారు. కొవిడ్‌ వరుస తరంగాలు దేశంలో నెలకొన్న వైద్య సదుపాయాల కొరతను బట్టబయలు చేశాయి. వివిధ రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వైద్య, ఆరోగ్య రంగానికి ఇంతవరకు తగిన ప్రాధాన్యతనివ్వడం లేదన్న విషయం కొవిడ్‌ సమయంలో ధ్రువీకరణౖంది. వెనువెంటనే కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు క్షేత్రస్థాయి నుంచి వైద్య, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ ముందుగా మేల్కొంది. తెలంగాణ ప్రభుత్వం వైద్యఆరోగ్య శాఖకు ఇతోధికంగా నిధులు మంజూరు చేసింది. గ్రామస్థాయి నుంచి వైద్య సదుపాయాల మెరుగుదలకు నడుంకట్టింది. జిల్లాలు, మండలాల స్థాయిలోనే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా ఆస్పత్రుల ఏర్పాటుకు అనుమతులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి కోసం ఏ ప్రజాప్రతినిధి, ఏ ప్రాంతంలో ఏ మేరకు నిధులు కోరినా వెంటనే ఆమోదించి విడుదల చేస్తోంది.

దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో కూడా ఆస్పత్రుల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరుగుతు న్నాయి. పలుచోట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజనతో ప్రతి జిల్లాలోనూ అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్యశాలలు, కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య రంగంలో బూమ్‌ ఏర్పడుతోంది. ఒకట్రెండేళ్ళలోనే ఆధునిక సదుపాయాలతో ఆస్పత్రులు అందుబాటులోకొచ్చేస్తున్నాయి.

ఇదంతా నాణానికో వైపు. అయితే మరో వైపు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వాస్తవానికి హైదరాబాద్‌ ఇప్పటికే జాతీయ స్థాయిలో అతిపెద్ద వైద్య ఆరోగ్య కేంద్రంగా మారిపోయింది. విదేశాల నుంచి ఆధునిక వైద్యం కోసం పలువురు రోగులు హైదరాబాద్‌కొస్తున్నారు. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతోంది. వివిధ రంగాల్లో నిపుణులు కూడా అందుబాటులో ఉన్నారు. అయితే గ్రామీణ స్థాయిలో వైద్యం చేసేందుకు వైద్యులెవరూ అందుబాటులో లేరు. కొత్తగా వైద్య విద్యలో పట్టాపొందుతున్న వారి సంఖ్యతో పోలిస్తే నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల్లో వైద్యుల డిమాండ్‌ చాలా ఎక్కువ. వేగంగా సాగుతున్న నిర్మాణాలకు సమాంతరంగా వైద్యుల నియామకాలపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. గ్రామీణ వైద్యాన్ని ప్రోత్సహించాలి. అవసర మైతే ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యుల్ని ఆకర్షించాలి. అలాగే రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల సంఖ్య పెంచాలి. ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకులోబడే పని చేస్తాయి.

వీటికి అనుమతుల రాక నుంచి నిధుల విడుదల వరకు పలు అడ్డంకులుంటాయి. ఈరంగంలో ప్రైవేటు యాజమాన్యాల్ని కూడా ప్రోత్సహించాలి. స్థానికంగా వైద్య విద్యలో తగినన్ని సీట్లు అందుబాటులోలేకే తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ వంటి చిన్న చిన్న దేశాలకు తరలిపోతున్నారు. అక్కడ వైద్యపట్టా పొందుతున్నారు. రాష్ట్రంలోనే ప్రైవేటు వైద్యశాలల్ని మరింతగా ప్రోత్సహిస్తే ఆసక్తి పరులందరికి ఇక్కడే సీట్లు లభిస్తా యి. వారిలో అత్యధికులు రాష్ట్రంలోనే వైద్యులుగా కొనసాగేందుకు ఆసక్తి చూపుతారు. ప్రభుత్వం పెద్దసంఖ్యలో నిర్మిస్తున్న ఆస్పత్రులన్నింటిలో వైద్యం అందించేందుకు తగినంత మంది అందుబాటులోకొస్తారు. ప్రభుత్వం ఈ దిశగా కూడా దృష్టి పెట్టాలి. కేవలం భవనాలు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చినంత మాత్రాన ప్రజలకు వైద్యం అందదు. వైద్య నిపుణుల నియామకంతోనే ఓ కొరత తీరుతుంది. ఇప్పటికే పలు రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ వైద్యఆరోగ్యరంగంలో కూడా మొదటి స్థానం సాధించగలగడంతో పాటు రాష్ట్రంలోని మారుమూల పల్లెవాసులకు, గిరిజన తండాలకు కూడా మెరుగైన వైద్యం సకాలంలో అందుతుంది. వారంతా ఆశించిన ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement