Sunday, May 12, 2024

పొంగులేటి అంత అహంకారం వ‌ద్దు.. మాజీ ఎంపీకి నామ క్లాస్..

సత్తుపల్లి: సత్తుపల్లిలో జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశంలో పొంగులేటిపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీపై ఆయన వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించారు. ఆహంభావంతో పొంగులేటి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరమని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరినీ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అగౌర్వ పర్చేవిధంగా మాట్లాడం పొంగులేటిలోని ఆహంభావానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవర్ని గెలిపించాలో ప్రజలు తీర్పు ఇస్తారని, కానీ పొంగులేటి ప్రజల్ని కూడా భేఖాతరు చేస్తూ అప్రజాస్వామికంగా మాట్లాడడం ఆయన ఆహంభావ స్వభావానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుని తీరుతుందని నామ స్పష్టం చేశారు. పార్టీ ద్వారా లబ్ది పొంది కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఏ తప్పు చేసి కేసీఆర్ కాళ్ల‌ మీద పడ్డారో ఆయనకే తెలియాలని నామ అన్నారు. ఎన్నికల ప్రజా క్షేత్రంలోనే ఎవరి సత్తా ఏమిటో ప్రజలే తేలుస్తారని నామ తెలిపారు.

పొంగులేటికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది.. కానీ అన్నింటినీ ఆయన చేజార్చుకున్నారని అన్నారు. ప్రజా స్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే.. వారిని కూడా పొంగులేటి ఖాతరు చేయకపోవడం ఆయనలోని దుందుకుడు స్వభావానికి, అహంహకారానికి మచ్చుతునకని నామ అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ‌ బిల్లుపై మొదటి ఓటు నాదేనని నామ గుర్తు చేశారు. పొంగులేటి చరిత్ర తెలుసుకుని మాట్లాడాల్సిందిగా నామ సూచించారు. ఎవరు అవకాశవాదో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసని, చరిత్ర, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని నామ అన్నారు. 14 ఏళ్ళు ప్రాణాలకు ఒడ్డి.. ఉవ్వెత్తున ఉద్యమించి తెలంగాణా సాధించిన సీఎం కేసీఆర్ పై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని నామ నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణా రాకముందు ఎట్లుండే. ఇప్పుడెలా ఉందో అందరికీ తెలిసిందేనని, ఇంతటి అభివృద్ధికి కారణమైన కేసీఆర్ పై అబాండాలు వేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు బీఆర్ఎస్ కైవశం చేసుకుంటుందని అన్నారు. పార్టీలోకి పిలిచి పీట వేస్తే నీవు చేసిందేమిటని పొంగులేటిని ప్రశ్నించారు. పార్టీలో ఉంటూనే పార్టీ అభ్యర్థులను ఓడగొట్టిన చరిత్ర నీదని నామ ఘాటుగా స్పందించారు. తన దగ్గరున్న ఆధారాలు, నీపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగానే సీఎం కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకుండా పక్కన బెట్టారని అన్నారు.

సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల దీవెనలు వల్ల తాను బ్రహ్మాoడమైన మెజార్టీతో గెలిచి పార్లమెంట్ కు పోయానని, ప్రజలందరికీ తాను పాదాభివందనం చేస్తున్నట్లు నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు.. డబ్బు.. పదవులు, అధికారం శాశ్వతం కాదని నామ నాగేశ్వర రావు గుర్తు చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఇంకా పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, కొత్తూరు ఉమా మహేశ్వర రావు , కూసంపూడి రామారావు, హైమావతి, రఫీ, వాసు, తోట సుజలారాణి, సంజీవ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరావు, బొంతు రమేష్, టెలికం సలహా మండలి సభ్యులు ఉప్పునూతల నాగేశ్వర రావు, వివిధ యూనియన్ల నాయకులు, అన్ని వార్డుల కౌన్సిలర్లు, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, భార్గవ్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement