Thursday, May 16, 2024

TS | మేడారం మొక్కులు.. క్యూ కట్టిన భక్తులు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : మేడారం జాతరకు నెలరోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి సెలవులు తోడవటంతో రద్దీ పెరిగింది. రెండు రోజుల్లోనే లక్షమందికిపైగా భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు జరగనున్న మేడారం మహాజాతరకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మేడారం జనసాగరంగా మారుతోంది. మహాజాతరకు ఇంకా నెలకు పైగానే సమయం ఉన్నా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా అప్పటికల్లా పూర్తవుతాయా? లేదా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మేడారం పనులపై మంత్రులు సీతక్క, కొండా సురేఖలు మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. మేడారం మహాజాతరకు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే నెల రోజుల ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న భక్తజనంతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

- Advertisement -

సంక్రాంతి సెలవులు తోడవటంతో రద్దీ పెరిగింది. రెండు రోజుల్లోనే లక్షమందికిపైగా భక్తులు సమ్మక్క, సారక్కల దర్శనాలు చేసుకున్నారు. చాలామంది ప్రైవేటు వాహనాల్లో మేడారం బాటపడుతున్నారు. ట్రాక్టర్లలోనూ వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలాచరించి గద్దెల వద్దకు పయనమౌతున్నారు. పసుపు, కుంకమలు, గాజులు, చీరా సారె సమర్పిస్తున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతరకు నెల రోజులే సమయం ఉండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయా లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జాతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించినా నిధుల విడుదల ఈసారి ఆలస్యం అయ్యింది. దీంతో పనులూ ఆలస్యం అయ్యాయి. కొన్ని పనులు వేగంగా జరుగుతుంటే మరికొన్ని ఇంకా ప్రారంభం కాలేదు. విద్యుత్‌ శాఖ, ఆర్టీసీ ఆధ్వర్యంలో పనులు కొంత వేగంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా భక్తులకు తాగనీరు అందించే పనులు పూర్తికాలేదు. 50 మినీ ట్యాంకులు, బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్యాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. పైపులైన్‌ కనెక్షన్లు సహా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

జంపన్నవాగు వద్ద స్నానఘట్టాల మరమ్మతు చేయలేదు. జంపన్నవాగులో ఇసుకను చదును చేయడం, ఇంటెక్‌ వెల్‌లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. క్యూలైన్ల మరమ్మత్తు పనులు టెండర్‌ దశలోనే ఉన్నాయి. సకాలంలో అన్ని పనులు పూర్తికాకపోతే వనదేవతల దర్శనానికి రానున్న దాదాపు కోటి మందికిపైగా భక్తులు పనులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో గడువులోగా పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే మేడారం జాతర పనులపై గురువారం మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement