Saturday, April 27, 2024

ఏపీలో 72 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు.. ఎంపీ జీవీఎల్ ప్రశ్నలకు రైల్వే మంత్రి బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు మంగళవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జవాబులిచ్చారు. 2022 ఏప్రిల్ వరకు ఏపీలో రైల్వే అభివృద్ధికి సంబంధించి 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు కలిపి మొత్తం 31 ప్రాజెక్టులు కేటాయించగా, వాటికయ్యే ఖర్చును రూ. 70,594 కోట్లుగా అంచనా వేసినట్టు తెలిపారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు.

అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 72 స్టేషన్లు ఉన్నాయని, వాటిలో 53 స్టేషన్లలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన జవాబులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సమాధానంపై జీవీఎల్ స్పందిస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 219 శాతం అధికంగా మోడీ ప్రభుత్వం రైల్వే కేటాయింపులు జరిపిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్టేషన్ల అభివృద్ధి, మౌలిక అవసరాల కల్పన వంటి అంశాలకు మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. వివిధ రైళ్ల కేటాయింపులు, స్మార్ట్ స్టేషన్లు, వందేభారత్ రైళ్లే ఇందుకు నిదర్శనమని జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement