Monday, April 29, 2024

మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జాతీయ రహదారులు అనుసంధానం.. మరింత మెరుగు పడనున్న ప్రజా రవాణా వ్యవస్థ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మూడు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ రహదారులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలోని పలు పట్టణాలను కలిపేందుకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) శ్రీకారం చుట్టింది. నాలుగు లేన్లుగా నిర్మించే ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా అధికారులు సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేయగా త్వరలోనే సంబంధిత పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మూడు రాష్ట్ర్రాల్లోని ప్రతిపాదిన రహదారుల నిర్మాణానికి రూ.5041 కోట్లు వ్యయం కాగలదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద మంచిర్యాల నుంచి వరంగల్‌, వరంగల్‌ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి విజయవాడ వరకు మూడు భాగాలుగా ఈ రహదారుల నిర్మాణం పనులు సాగనున్నాయి.

మంచిర్యాల నుంచి వరంగల్‌ వరకు 112 కి.మీ.గా గుర్తించిన అధికారులు దానిని మూడు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం పనులు చేపట్టనున్నారు. అలాగే, మహారాష్ట్ర్రలోని నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే 363 జాతీయ రహదారిని శ్రీరాంపూర్‌ వద్ద అనుసంధానం చేస్తారు. అది వరంగల్‌, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ వరకు వెళ్లనుంది. మరోవైపు, నిజామాబాద్‌ నుంచి జగ్దల్‌పూర్‌ వెళ్లే రహదారికి అనుసంధానం కానుంది. దీని ద్వారా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర్రలకు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. మంచిర్యాల జిల్లాలో ప్రారంభమయ్యే రహదారి మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర, వరంగల్‌ వరకు ఉంటుంది. తిరిగి అక్కడి నుంచి మహబూబాబాద్‌, ఉరవకొండ, గీసుకొండ, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం, ఖమ్మం వరకు ఉంటుంది. ఖమ్మం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా తునికిపాడు, సిరిపురం, జమిడిచర్ల, దుగ్గిరాలపాడు, నెక్కెంపాడు మీదుగా ఈ రహదారి విజయవాడ వెళ్లనుంది.

కాగా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలను అనుసంధానం చేస్తూ నిర్మించ తలపెట్టిన ఈ జాతీయ రహదారుల నిర్మాణంతో మూడు రాష్ట్రాలలో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం అధికారులు ప్రతిపాదిస్తున్న విధానంలో ఉన్న రహదారి గుండానే వెళ్లనున్నందున నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటంతో పాటు భూ సేకరణకు సంబంధించి అభ్యంతరాలకు కూడా పెద్దగా అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. దీంతో సంబంధిత పనులు వేగంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు భావిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తయితే మూడు రాష్ట్రాలలోని ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగు పడనున్నాయి. దీంతో పాటు రహదారుల నిర్మాణం పూర్తయితే, వ్యాపార, వాణిజ్య రంగాలు సైతం అభివృద్ధి చెందనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement