Wednesday, May 15, 2024

BRS – కేంద్రంలో వచ్చేది హంగే – కెసిఆర్

వరంగల్‌ జిల్లా తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఆయన ఇవాళ వరంగల్‌ జిల్లాలో రోడ్‌ షో నిర్వహించారు.ఈ సందర్భంగా కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌ జిల్లా గొప్పతనాన్ని కొనియాడారు. వరంగల్‌ మట్టితో, చరిత్రతో తనకు విడదీయరాని బంధం ఉన్నదని చెప్పారు.కేసీఆర్‌ ఇంకా ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ’42 డిగ్రీల ఎండ ఉన్నా ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చిన నా అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు నమస్కారం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నయ్‌. చాలా చైతన్యం ఉన్న వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ సుధీర్‌ పోటీ చేస్తున్నారు. ఆయనను మీరు భారీ మెజారిటీతో గెలిపించాలె. మీ ఆశీర్వాదాలతో ఆయన పార్లమెంటులో అడుగుపెట్టాలె’ అన్నారు.

‘తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్‌ జిల్లా. నాడు ఉద్యమం జరిగే రోజుల్లో ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చింది. ఈ మట్టితో, ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం. 1969 నుంచి విరామం ఎరగకుండా, రాజీపడకుండా పోరు చేసిన మన కాళోజీ, మన జయశంకర్‌ సార్‌ను తల్చుకుంటే ఉద్వేగభరితమైన ఆవేశం వస్తుంది’ అని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని కేసీఆర్‌ అన్నారు. సమైక్య వాదుల పాలనలో జిల్లా అన్ని విధాలుగా వెనుకబడి పోయిందని, అజాం జాహీ మిల్లు ఆగమై పోయిందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జిల్లా అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పారు.

‘సమైక్యవాదుల పాలనలో మన వరంగల్‌ జిల్లా అన్ని విధాలుగా వెనుకబడింది. అజాం జాహీ మిల్లు ఆగమైపోయింది. బీఆర్‌ఎస్‌ పాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నం. వరంగల్‌ నడిబొడ్డున 24 అంతస్తులతో ఆకాశమంత ఎత్తున సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించుకున్నం. నగరంలో హెల్త్‌ యూనివర్సిటీ పెట్టుకున్నం. పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్ తెచ్చుకున్నం. జిల్లాకు ఐదు మెడికల్‌ కాలేజీలు తెచ్చుకున్నం. ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్‌, జనగామల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలు పెట్టుకున్నం. ఇవన్నీ మీ సాక్షిగనే జరిగినయ్‌’ అని కేసీఆర్ అన్నారు.

- Advertisement -

‘ఇప్పుడున్న ముఖ్యమంత్రి చిత్రవిచిత్ర మాటలు మాట్లాడుతున్నడు. వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటడు. మరె మన నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్‌లో, డోర్నకల్‌లో, పరకాలలో, వర్దన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినయ్‌ నీళ్లు..? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరాంసాగర్‌ స్టేజ్‌-2 ద్వారా దశాబ్దాలు గడిచినా బొట్టు నీళ్లు రాలేదు. మీ సహకారంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని పూర్తిచేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్‌ జిల్లాకు నీళ్లు వచ్చినయ్‌. బ్రహ్మాండమైన పసిడి రాశుల లాంటి పంటలు పండినయ్‌’ అని కేసీఆర్‌ చెప్పారు..

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ అధినేత మండిపడ్డారు. ‘ఇక్కడ ఒక మనిషికి టికెట్‌ ఇచ్చాం. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. ఇప్పుడు ఎందుకు పార్టీ మారిపోయిండు. ఎందుకోసం మారిండు పార్టీ ? కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఇంకో మూడునెలల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదు. మీరు రాసిపెట్టండి. నేను చెబుతున్న జరుగబోయేది సత్యం. ఖచ్చితంగా మూడునెలల్లో ఉప ఎన్నిక రాక తప్పదు. ఇదే రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదు. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే’నన్నారు

‘కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ ఇన్ని హామీలు ఇచ్చారు.. అమలు చేస్తలేరని అని మన ప్రతినిధులు అసెంబ్లీలో అడిగారు. ముఖ్యమంత్రి ఏమంటున్నడు. కేసీఆర్‌ నీ గుడ్లుపీకి గోళీలు ఆడుకుంటా.. నీ పేగులు తీసి మెడలో వేసుకుంట.. ఆఖరికి నీ ముడ్డిమీది చెడ్డి కూడా గుంజుకుంట అంటున్నడు. నేను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న.. నా నోట ఇలాంటి మాట నా నోటి నుంచి విన్నరా? కేసీఆర్‌ నిన్ను కొంచబోయి చర్లపల్లి జైలులో వేస్తా? జైళ్లకు తోకమట్టకు నేను భయపడుతనా? కేసీఆర్‌ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎన్ని దెబ్బలు తిన్నం. ఎన్ని నిరాహార దీక్షలు చేశాం. ఎన్ని రాజీనామాలు చేశాం. ఎన్నిసార్లు పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేసినం. గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా?’ అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఓట్లుపడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్‌ పంపిండని.. ఈ చేతగాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని కెసిఆర్ మండిపడ్డారు.

‘ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినయ్‌. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా జరుగుతుండే. ఇప్పుడు డౌన్‌ అయ్యిందా ? పెరిగిందా?’ అంటూ ప్రశ్నించారు. బంద్‌ అయ్యింది అంటూ జనం నినదించారు. ‘అందులో బతికే వేల మంది ఇవాళ రోడ్లపై పడ్డారు. హైదరాబాద్‌, పెద్దపెద్ద నగరాల్లో గత ఐదునెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. పర్మిషన్లు ఇవ్వకపోవడానికి కారణం ఏందీ? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్‌ బీపాస్‌ తీసుకువచ్చాం. అప్లికేషన్‌ పెడితే 21 రోజుల్లో ఆటోమేటిక్‌గా పర్మిషన్‌ ఇవ్వాలి. అది చట్టం. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్‌ ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాల్లో ఉన్నట్లుగా స్వ్కేర్‌ ఫీట్‌ ఇంత అని కాంగ్రెస్‌ పార్టీకి లంచం ఇవ్వాలట. దాని కోసం మొత్తం ప్రగతిని ఆపేసి.. అభివృద్ధిని ఆపేసి పర్మిషన్లు ఇవ్వడం లేదు. పూర్తయిన బిల్డింగ్‌లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్‌ ఇవ్వడం లేదు. ఈ బండారం బయటపెడతాం. రేపే.. ఎల్లుండో ముందుకుపోతాం’ అని స్పష్టం చేశారు.

‘ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయితీలు పెట్టించుడు.. విద్వేషం తప్పా.. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అందుకోసం యువకులను నేను కోరుతున్నా. వెర్రి ఆవేశం కాదు. పిచ్చి ఆవేశం కాదు. ఈ దేశం మీది. ఈ రాష్ట్రం మీది. రేపటి భవిష్యత్‌ మీది. ఈ విషయాలను ఊర్లు, బస్తీలు, గ్రామాల్లో చర్చ పెట్టాలి. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్ట సుఖాలు ఉంటాయా? మోదీ వంద నినాదాలు చెప్పారు. బేటీ బచావో.. బేటీ పడావో. ఎక్కడన్న ఏమైనా వచ్చిందా? జన్‌ధన్‌ యోజనలో ఎవరి బ్యాంకులకైనా రూ.5లు వచ్చినయా? విదేశాలకెళ్లి నల్లధనం తెస్తా.. ఇంటికి రూ.15లక్షలు ఇస్తా అన్నడు. మరి ఇచ్చిండా? రూ.15లు కూడా రాలేదు. అమృత్‌కాల్‌ వచ్చిందా? అచ్చేదిన్‌ వచ్చిందా? అచ్చేదిన్‌ రాలేదు కానీ, సచ్చేదిన్‌ వచ్చింది’ అన్నారు.

‘మన కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ వస్తే.. దాన్ని ప్రధాని గుజరాత్‌కు ఎత్తుకుపోయిండు. కాజీపేటకు వచ్చేదాన్ని గుజరాత్‌కు తీసుకుపోయాడు. అధేవిదంగా గిరిజన విశ్వవిద్యాలయం పదేళ్ల నుంచి వందసార్లు అడిగితే మొన్న ఎలక్షన్లకు ముందు కాగితం ఇచ్చారు. పదేళ్లు పడతదా ప్రధానమంత్రికి ? ధరల పెరుగుదల, రూపాయి విలువ రూ.83కి పడిపోయింది. ఏ హామీ నెరవేరలేదు. 18లక్షల ఉద్యోగాలు ఖాళీగా కేంద్రంలో ఒక్కదాన్ని నింపరు. ఇవన్నీ పోను మళ్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది. మనకు ఉన్న ఒకే ఒక నది.. మన బతుకుదెరువు. నేడైనా.. రేపైనా భవిష్యత్‌లోనైనా గోదావరి నదే. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతుకోసి గోదావరి నది ఎత్తుకుపోతా.. తమిళనాడుకు, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతున్నడు. దయచేసి ఆలోచించాలి’ అన్నారు

‘బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులకు నా మనవి. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలే ఉన్నది. ఇంకా చాలా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అంటే ఎట్ల ఉంటదో వరంగల్‌లో కట్టిన ఆసుపత్రే నిదర్శనం. ఆకాశమంత ఎత్తున ఇవాళ అందరికీ కనిపిస్తున్నది. అలాంటి ప్రతిభ ముందుకుపోవాలి. అలాంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్ర ముందుకు దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాలి. మే పార్టీ 13 వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలి. చైతన్యం ఉన్న ఈ వరంగల్‌ గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా’నన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో హంగ్‌ రాబోతుందని.. అందులో బీఆర్‌ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.’ఈ రోజు ప్రచారం డంబాచారం. నరేంద్ర మోదీకి కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. రోజూ పేపర్లలో వార్తలు వస్తున్నయ్‌. ఈ మోఖాలో ఇవాళా.. తెలంగాణలో పార్లమెంట్‌ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ. 14-15 ఎంపీలతో మనంపోతే.. కేంద్రంలోని హంగ్‌ పార్లమెంట్‌ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకు ఈ రోజు ఉంది. మన గోదావరి కాపాడుకోవాలన్నా.. కృష్ణా నది కాపాడుకోవాలన్నా.. తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా.. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా.. నిరుద్యోగ సమస్య తీరాలన్నా.. మన బతుకులు బాగుపడాలన్నా.. ఖచ్చితంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాలి. అదే క్షేమం’ అన్నారు

రైతుబంధు పోయిందా? కరెంటు బంద్‌ అయ్యిందా? కోతలు వచ్చినయా? వడ్లు కొంటున్నరా? బోనస్‌ ఇస్తున్నారా? బోనస్‌ బోగస్‌ అయ్యిందా? ఇవన్నీ మోసాలు చేసిన తర్వాత గోదావరి ఎత్తుకుపోతా అనే బీజేపీకి గానీ.. వాగ్ధానాలను భంగం చేసిన కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏమైతది ? మేం అన్నీ మోసం చేసినా.. మళ్లీ మాకే ఓటేశారని అన్నీ పండవెడుతరు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్‌కు పంచాయితీ పడ్డది. ప్రజల తరఫున పొట్లాడే పంచు ఎవరు? పోయిన ఎలక్షన్ల కిందపడగొట్టి.. మళ్లీ ఇప్పుడు పంచుకమ్మంటరు. నేనేనా? బీఆర్‌ఎస్సేనా? కొట్లాడుదామా? యుద్ధం చేద్దామా? గోదావరిని కాపాడుకుందామా? కృష్ణాను కాపాడుకుందామా? మళ్లీ బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌లాగా రైతుబంధు ఇచ్చుకుందామా? కంటి నిండా కరెంటును తెచ్చుకుందామా? ఇది జరగాలంటే సుధీర్‌కుమార్‌ గెలవాలి. మీరు నాకిచ్చే బలంతోనే కదా? కొట్లాడేది’ అన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement