Monday, April 29, 2024

Hyd | గిఫ్ట్​ల పేరిట మోసం.. కాప్స్​కి చిక్కిన నైజీరియా క్రిమినల్​

ఆన్‌లైన్‌లో బహుమతుల పేరిట మోసం చేస్తున్న నైజీరియా దేశస్తులను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.22 కోట్ల మేర మోసం చేసిన కేసులో సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ టీమ్​ న్యూఢిల్లీలో ఒనుయిగ్బో చిబుజో గాడ్విన్ అలియాస్ బాబీ (42)ని పట్టుకుంది. అతను నకిలీ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నాడని, నైజీరియాలో నివసిస్తున్న ప్రధాన నిందితులు సెక్యూరో, ఓక్వుచుక్వులకు ఆ నకిలీ ఖాతాలలో మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ పంపేవాడని పోలీసులు వెల్లడించారు.

నిందితులు గిఫ్ట్‌ ఫ్రాడ్‌ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. బాబీ తన వాటాకు జమ చేసిన మొత్తాలపై 20శాతం పొందేవాడు. ఐవరీ కోస్ట్ (వెస్ట్ ఆఫ్రికా)కు చెందిన బకాయోకో లస్సినా, మేఘాలయకు చెందిన షోమా పుర్కాయస్త అలియాస్ షోమా ప్రసాద్ పుర్కాయస్త ఫిబ్రవరి 2023లో ఇదే కేసులో అరెస్టయ్యారు. నైజీరియాకు చెందిన ప్రధాన సూత్రధారి బాబీని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అతని నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన సెక్యూరో, ఓక్వుచుక్వు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, నిందితులు US/UK జాతీయుల వలె నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లను సృష్టించి ఇదంతా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. దేశంలోని ఆడాళ్లకు మగాళ్ల మాదిరిగా, మగాళ్లకు ఆడాళ్ల మాదిరిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపేవారు. వారితో స్నేహం పెంచుకుని వాట్సాప్‌లో చాటింగ్‌ చేసేవారు. కొద్దిరోజులు కబుర్లు చెప్పుకుంటూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు.

- Advertisement -

కొంత విశ్వాసం వచ్చిన తర్వాత వారు ఖరీదైన బహుమతులు, నగలు తదితరాలను పంపుతామని బాధితులకు తెలియజేసి.. ఆ తర్వాత కస్టమ్స్ డిపార్ట్ మెంట్‌కు చెందినట్లుగా నకిలీ మొబైల్ నంబర్‌లతో బాధితులను సంప్రదించి ఆర్‌బీఐ చార్జీల పేరుతో డబ్బు వసూలు చేసేవారు. కస్టమ్స్, GST, ఇతర చార్జీల పేరుతో వారు ఇచ్చిన నకిలీ బ్యాంకు ఖాతాల్లో మొత్తాలను డిపాజిట్ చేయాలని బాధితులను నమ్మించారు. ఇలాంటి మోసాలపై వచ్చిన ఫిర్యాదులతో హైదరాబాద్​ సైబర్​ క్రైమ్స్​ డిపార్ట్​మెంట్​ ఓ టీమ్​ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేసి, వారి ఆట కట్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement