Thursday, May 16, 2024

ఎల్‌నినో ప్రభావంతో తగ్గనున్న ఆహార ధాన్యాల దిగుబడులు

ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పలు రకాల పంటల దిగుబడులపై ప్రభావం పడనుంది. దీనిపై వ్యవసాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా వరి ధాన్యం ఉత్పత్తిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. 2023-24 సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి 3.35 శాతం తగ్గి 106.31 మిలియన్‌ టన్నులు వస్తుందని అంచనా వేసింది. ఈ సంవత్సరం మేలో వ్యవసాయ శాఖ విడుదల చేసిన అంచనాల్లో వరి ధాన్యం ఉత్పత్తి 110 మిలియన్‌ టన్నులు వస్తుందని తెలిపింది.

ఈ సారి సాగు భూమి పెరిగినప్పటికీ ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడింది. తాజాగా విడుదల చేసిన అంచనాల ప్రకారం అన్ని ప్రధాన ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గుతున్నాయి. మినుము, కంది, పెసర, సోయాబీన్‌, చెరకు పంటల దిగుబడులు ఎక్కువగా తగ్గే అకాశం ఉంది. బఠానీ ఉత్పత్తి మాత్రం పెరుగుతుందని తెలిపింది. జొన్నలు, సజ్జలు, రాగులు, పొద్దుతిరుగుడు వంటి పంటల ఉత్పత్తిని అంచనాలను నిలిపివేసింది.

ప్రధానంగా ఆగస్టులు వర్షాభావ పరిస్థితుల మూలంగానే పంటల దిగుబడి గణనీయంగా తగ్గిందని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ సంవ త్సరం ప్రారభంలో అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) ఇండియాలో వరి ఉత్పత్తి కనీసం 20 లక్షల టన్నుల దిగుబడి తగ్గుతుందని అంచనా వేసింది. ప్రారంభంలో విడుదల చేసిన ఖరీఫ్‌ ఉత్పత్తి అంచనాలు గత మూడు సంవత్సరాల సమాచారం ఆధారంగా అంచనా వేసినవని, శుక్రవారం రాత్రి విడుదల చేసిన అంచనాలు వాస్తవంగా క్షేత్ర స్థాయిలో పంటల పరిస్థితిపై విడుదల చేసిన అంచనాలని వ్యవసాయ శాఖ తెలిపింది.

- Advertisement -

దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 158.06 మిలియన్‌ టన్నులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఇవి 148.57 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ తెలిపింది. గత ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన అంచనా కంటే ఇది 4.6 శాతం తక్కువ. వాస్తవానికి ఈ ఖరీఫ్‌లో దేశంలో 2 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు పెరిగింది. అనూహ్యంగా ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. 1901 తరువాత ఆగస్టులో ఈ స్థాయిలో వర్షపాతం తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని వ్యవసాయ శాఖ తెలిపింది.

పప్పుధాన్యాల ఉత్పత్తి 6.6 శాతం తగ్గి 7.12 మిలియన్‌ టన్నులుగా ఉంటుందని అంచనా వేసింది. గతంలో ఇది 7.62 మిలియన్‌ టన్నులు వస్తుందని అంచనా వేశారు. కందిపప్పు ఉత్పత్తి మాత్రం సాగు భూమి 5 శాతం తక్కువగా 43.87 లక్షల హెక్టార్లలో ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం 3.3 శాతం పెరిగి 3.42 మిలియన్‌ టన్నులు ఉంటుందని అంచనా వేసింది. పెసర పప్పు ఉత్పత్తి మాత్రం 18 శాతం తగ్గి 1.41 మిలియన్‌ టన్నులు ఉంటుందని తెలిపింది. మినుముల ఉత్పత్తి మాత్రం 14.7 శాతం తగ్గి 1.51 మిలియన్‌ టన్నులు ఉంటుందని తెలిపింది.

ఒక్క రాజస్థాన్‌లోనే పెసర పంట దిగుబడులు 40 శాతానికి పైగా తగ్గిపోయిందని తెలిపింది. పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల దిగుబడులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే అన్ని రకాల ఆహార ధాన్యాల దిగుబడులు 2022-23 సీజన్‌లో 155.11 మిలియన్‌ టన్నులుగా ఉంటే, ఈ సారి అది 4.22 శాతం తగ్గి 148.56 మిలియన్‌ టన్నులుగా ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. నూనె గింజలు ఉత్పత్తి కూడా తగ్గింది.

ఇందులో వేరు శనగ ఉత్పత్తి గత సీజన్‌లో 8.49 మిలియన్‌ డాలర్లు ఉంటే, ఈ సారి అది 7.89 శాతం తగ్గి 7.82 మిలియన్‌ టన్నులుగా ఉంది. సోయాబీన్‌ ఉత్పత్తి గత సీజన్‌లో 14.97 మిలియన్‌ టన్నులు ఉంటే, ఈ సారి అది 23.05 శాతం తగ్గి 11.52 మిలియన్‌ టన్నులుగా ఉంది. చెరకు ఉత్పత్తి గత సీజన్‌లో 494.22 మిలియన్‌ టన్నులు ఉంటే, ఈ సారి అది 12.03 శాతం తగ్గి 434.79 మిలియన్‌ టన్నులుగా ఉంది. పత్తి ఉత్పత్తి గత సీజన్‌లో 34.34 మిలియన్‌ టన్నులు వస్తే, ఈ సీజన్‌లో 7.83 శాతం తగ్గి 31.65 మిలియన్‌ టన్నులుగా ఉంది. జూట్‌ ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పెరిగింది. గత సీజన్‌లో 9.1 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి వస్తే, ఈ సీజన్‌లో 0.99 శాతం పెరిగి 9.19 మిలియన్‌ టన్నులుగా ఉంటుందని వ్యవసాయ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement