Friday, April 26, 2024

హర్యానా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణస్వీకారం

హర్యానా గవర్నర్​గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. కరోనా నిబంధనల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతితక్కువ మంది ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే హాజరయ్యారు. హర్యానా సీఎం మనోహర్ లాల్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా మరికొందరు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్రం.. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. హర్యానా గవర్నర్‌ సత్యదేవ్‌ ఆర్యా.. త్రిపురకు బదిలీ కాగా ఆయన స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను నియమించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ నియమితులయ్యారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్​గా నియమించిన సంగతి తెలిసిందే.

కాగా 1980లో తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన దత్తాత్రేయ ప్రస్థానం.. ఆ తర్వాత ఏళ్లలో.. పలుమార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా గెలిచేలా సాగింది. 2019లో కేంద్రం.. ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో దత్తాత్రేయ హర్యానా గవర్నర్​గా బదిలీ అయ్యారు.

ఈ వార్త కూడా చదవండి: వరద నీటిలో చిక్కుకున్న ఎమ్మెల్యే కారు

Advertisement

తాజా వార్తలు

Advertisement