Wednesday, May 22, 2024

Congress ఎమ్మెల్సీ అభ్యర్థి బల్మూరి రాజకీయ ప్రస్థానం

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌) : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట నర్సింగ్‌రావును అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గత పదేళ్లుగా వెంకట్‌ అనేక ఉద్యమాలు చేపట్టారు. పలుమార్లు పోలీసులచే లాఠీఛార్జీలో గాయపడడంతోపాటు జైలుకు సైతం వెళ్లారు. కష్టకాలంలో హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ హై కమాండ్‌ సూచనతో హుజురాబాద్‌ టికెట్‌ను త్యాగం చేశారు. ఉద్యమ నేపథ్యం, హైకమాండ్‌కు విధేయుడిగా ఉండడంతో ఏఐసీసీ వెంకట్‌కు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం తారుపల్లి వెంకట్‌ అమ్మమ్మ ఊరు. 1992 నవంబర్‌ 2న జన్మించిన వెంకట్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనంతరం విద్యార్థి నాయకుడిగా అనేక పోరాటాలకు శ్రీకారం చుట్టారు.

2015 నుంచి 2017 వరకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. 2018లో రెండోసారి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వెంకట్‌ చివరి వరకు ప్రయత్నించారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేయడంతో పెద్దపల్లిలోని వెంకట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

నామినేషన్‌ వేసేందుకు లేఖను సిద్ధం చేసుకోవాలని వెంకట్‌కు అధిష్టానం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం కూడా అందింది. గురువారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. 18వ తేదీ నామినేషన్ల చివరి తేదీ కాగా, 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, జనవరి 29న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.

అయితే ఎన్నికల కమిషన్‌ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం వేర్వేరుగా ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తుండడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఎమ్మెల్సీగా వెంకట్‌ ఎన్నిక లాంఛనమే కానుంది. కాంగ్రెస్‌ అధిస్టానం వెంకట్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ పెద్దపల్లి పెద్దపీట వేసి అరుదైన గౌరవం అందించారని చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement