Sunday, April 28, 2024

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశం కోవిడ్ సెకండ్ వేవ్ మధ్యలో ఉందని పేర్కొంది. వచ్చేది పండుగల సీజన్ కావడంతో సెప్టెంబరు, అక్టోబరు మాసాలు ఎంతో కీలకమని కేంద్రం వివరించింది. కరోనా వ్యాక్సిన్‌ల ద్వారా రక్షణ పొందవచ్చని కానీ ప్రతి ఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని స్పష్టం చేసింది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం నాడు పలు వివరాలను తెలియజేసింది.

గత 24 గంటల్లో 46 వేల కొత్త కేసులు వచ్చాయని వెల్లడించింది. దాదాపు 60 శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయని తెలిపింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించింది. కేరళలో ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో సగం కేసులు కేరళలోనే ఉన్నాయని వెల్లడించింది. కాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్రం వర్గాలు వెల్లడించాయి. జాతీయ సాంకేతిక సలహా బృందంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ వార్త కూడా చదవండి: తిరుమలలో ఉచిత దర్శనాలను అనుమతించాలి: స్వరూపానందేంద్ర

Advertisement

తాజా వార్తలు

Advertisement