Saturday, May 25, 2024

బోరిస్‌.. మా దేశంలో అడుగుపెట్టొద్దు, రష్యా ఆంక్షలు

ఉక్రెయిన్‌ ఎదురుదాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్యా ఆ దేశానికి అండగా ఉన్నవారిపై ఆగ్రహంతో ఊగిపోతోంది. ప్రత్యేకించి ఉక్రెయిన్‌కు బేషరతుగా అన్నివిధాలా సహకరిస్తున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సహా 12మంది ప్రముఖలపై ఆంక్షలు విధించింది. తమ దేశంలో అడుగుపెట్టరాదని హెచ్చరించింది. 12మంది ప్రభుత్వ పెద్దల పేర్లు ఉటంకిస్తూ ఏకంగా ఒక జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, మాజీ ప్రధాని థెరెసా మే, ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రాస్‌, రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌, భారత సంతతికి చెందిన ప్రీతిపటేల్‌, సహా ప్రముఖులున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అది మరింత తీవ్రం అయ్యేలా బ్రిటన్‌ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని, ఉక్రెయిన్‌ నియోనాజీ వైఖరిని సమర్థిస్తోందని ఆరోపిస్తూ ఆంక్షలను విధించినట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

త్వరలో మరికొందరిపైనా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన టాస్‌ వార్తాసంస్థ ధ్రువీకరించింది. కాగా ఉక్రెయిన్‌లోని బుచా, ఇర్పిన్‌ నగరాల్లో అమాయక పౌరులను ఊచకోత కోసిన రష్యా యుద్ధనేరాలకు పాల్పడిందని, ఈ యుద్ధంలో పుతిన్‌ను ఓడించి తీరాల్సిందేనని బోరిస్‌ జాన్సన్‌ నిర్ద్వందంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు. బోరిస్‌ సాహసోపేతమైన నిర్ణయాలతో దిక్కుతోచని రష్యా ఆంక్షలు విధించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement