Thursday, May 30, 2024

TS : ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు నేటితో ముగియ‌నున్న ప్ర‌చారం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇవాళ్టితో ప్రచారం ముగియనుంది. దీంతో పట్టభద్రుల్ని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎమ్మెల్సీ స్థానంలో గెలవాలనే లక్ష్యంతో ప్రచారం చేస్తోంది. గతంలో ఈ స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని శక్తి వంచన లేకుండా శ్రమిస్తోంది. ఇక బీజేపీ సైతం ఈ ఉప ఎన్నికను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

- Advertisement -

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను బరిలో దింపగా.. బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రాధాన్యత ఓట్ల ప్రకారం విజేత నిర్ణయించే ఈ ఎన్నికల్లో పట్టభద్రులను ఆకట్టుకోవడానికి మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న తీన్మార్ మల్లన్నకు సపోర్ట్‌గా మంత్రి సీతక్క వరంగల్, ఖమ్మం జిల్లాలో ప్రచారం ముమ్మరం చేయగా… నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారాలు నిర్వహించారు. ఇక బీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాకేశ్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్, హరీష్ రావు ప్రచారాలు చేపట్టారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలో హరీష్ రావు ప్రచారాలు నిర్వహించగా… నల్గొండ జిల్లాలో కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మోసపూరిత హామీలతో నెగ్గిన కాంగ్రెస్…ప్రజలను మోసం చేసిందని… ఇప్పటికైనా.. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్‌ అభ్యర్థినే గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా.. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, వరంగల్‌లో ప్రచారం చేపట్టారు. డీకే అరుణ నల్గొండలో.. ఈటల రాజేందర్ వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికే పట్టం కట్టాలని బీజేపీ పిలుపునిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement