Monday, May 6, 2024

రెచ్చిపోయిన రష్యా.. కీవ్‌, లివివ్‌, ఖార్కీవ్‌ పట్టణాలపై క్షిపణి దాడులు

ఉక్రెయిన్‌ ప్రయోగించిన నెప్య్టూన్‌ క్షిపణి దాడుల్లో దగ్ధమై, నల్లసముద్రంలో రష్యా యుద్ధనౌక మాస్క్వా మునిగిపోయిన నేపథ్యంలో ప్రతీకారంతో రగిలిపోతున్న రష్యా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఇతర నగరలాు లివివ్‌, ఖార్కివ్‌ పట్టణాలపై శనివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్‌ గగనతలంలోని దూసుకొచ్చిన రష్యా యుద్ధవిమానాలు క్షిపణులతో ఆ రెండు పట్టణాలపై దాడి చేశాయి. ఆ మరుక్షణం పలుచోట్ల మంటలు చెలరేగగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. తాజా దాడుల్లో కనీసం ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది క్షతగాత్రులైనారు. గడచిన రెండువారలలో ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. కాగా శనివారంనాడు రష్యా ప్రయోగించిన నాలుగు క్షిపణులను మార్గం మధ్యలోనే కూల్చేశామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. కొద్దిరోజులుగా కీవ్‌ జోలికి వెళ్లని రష్యా మాస్క్వాను కోల్పోయిన తరువాత శుక్రవారం నుంచి రాజధానిపై మళ్లిd దాడులు మొదలుపెట్టింది. మరోవైపు రష్యా యుద్ధనౌక దగ్ధమైన సంఘటనకు సంబంధించి తాజాగా శాటిలైట్‌ చిత్రాలు విడుదలయ్యాయి. నౌక మొత్తం అగ్నికీలల్లో దగ్ధమవుతున్న దృశ్యం ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. అందులోని సిబ్బందిని రక్షించేందుకు సమీపంలో అక్కడక్కడ కొన్ని చిన్నచిన్న నౌకల కదలికలున్నట్లు ఆ చిత్రాల్లో గుర్తించొచ్చు. ఈ సంఘటనలో రష్యా యుద్ధనౌకలోని కెప్టెన్‌ సహా 510 మంది సిబ్బందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని, వారంతా మరణించారని తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారించొచ్చని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అందువల్లే రష్యా ప్రతీకారంతో ఊగిపోతోందని, శుక్రవారం కీవ్‌ సమీపంలోని ఆయుధ తయారీ కర్మాగారంపైన, శనివారం రాజధానితోపాటు లివివ్‌పైన దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తరువాత రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముప్పేట దాడులు చేసి విఫలమైన రష్యా ఆ తరువాత బలగాలను ఉపసంహరించుకుని తూర్పు, పశ్చిమ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక చోట్ల సాధారణ పౌరులను వందల సంఖ్యలో ఊచకోత కోసింది.

మరియపోల్‌ నగరం దాదాపు రష్యా స్వాధీ నంలోకి వెళ్లిపోయింది. ఇక్కడ శవాల గుట్టలు గుండెలను పిండేశాయి. ఇప్పుడు తాజాగా కీవ్‌లోనూ 900 మృతదేహాలు లభ్యమవడంతో రష్యా ఎంత క్రూరంగా వ్యవహరించిందో కళ్లకు కడుతోంది. కీవ్‌నుంచి బలగాలను ఉపసంహరించిన సమయంలో వారిని కాల్చి చంపినట్లు పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అమాయక పౌరుల మృతదేహాలు కుళ్లిపోయి వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరికొన్ని తాత్కాలిక శ్మశానాల్లో పడేశారని స్థానిక పోలీసులు ప్రకటించారు. కాగా మాస్క్వా ఉదంతాన్ని ఉటంకిస్తూ అమెరికా సహా నాటో కూటమి ఉక్రెయిన్‌కు అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన ఆయుధాలు అందించడం ద్వారా యుద్ధంలో ఆజ్యం పోస్తున్నాయని, ఆ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా హెచ్చరించింది. ఈ మేరకు ఒక నోట్‌ను అమెరికాకు పంపింది. కాగా కీలకమైన నౌకాకేంద్రం మరియపోల్‌పై రష్యా పూర్తిస్థాయిలో పట్టు సాధించింది. దేశం దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో రష్యా దాడులు ఉధృతం చేసిందని, ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందని, అయినా ప్రాణాలకు తెగించి సైనికులు పోరాడుతున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement