Thursday, May 16, 2024

రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యల వెనుక బీజేపీ.. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇస్తామన్న కాంగ్రెస్​

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసిఆర్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందని, వారి ఆలోచనలను కేసీఆర్ ద్వారా వెల్లడించారని తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగోర్ వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ వ్యాఖ్యలను ప్రధానమంత్రి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ తరఫున ధర్నా చేపట్టామని అన్నారు.

కేసీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం దళితులు, గిరిజనులకు హక్కులు కల్పించిందని, వాటిని తొలగించేందుకు కుట్ర జరుగుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ వ్యాఖ్యలను అందరికీ తెలియజేసేందుకు మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. కేసీఆర్‌పై చర్యలు చేపట్టేవరకు కాంగ్రెస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement