Friday, April 26, 2024

Big Story: ఐటీ కంపెనీలకు వలసల టెన్షన్‌, ఉద్యోగులు చేజారకుండా వేతనాల పెంపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఐటీ కంపెనీలకు ఉద్యోగుల వలసల భయం పట్టుకుంది. డీల్స్‌ పెరిగి ఉద్యోగులకు డిమాండ్‌ ఎక్కువవుతుండడంతో కంపెనీలు పోటీపడి జీతాలు ఆఫర్‌ చేస్తుండడంతో ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి వలసలు పెరిగిపోయాయి. దీంతో పేరొందిన కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా కంపెనీలకు ఉద్యోగులను కాపాడుకోవడానికిగాను వేతన ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఈ ఆర్థిక సంవత్సర(2022) తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధుల వ్యాఖ్యలు ఎక్కువగా ఉద్యోగుల వలసల మీదే ఉండడం గమనార్హం. ప్రపంచంలో కొవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత అతిత్వరగా కోలుకున్న రంగాలలో ఐటీ రంగం ఒకటి. అనంతరం డిజిటల్‌ దిశగా పయనిస్తున్న ఐటీ కంపెనీలకు హై స్కిల్‌ ఉన్న ఉద్యోగుల అవసరం ప్రస్తుతం ఎక్కువగా ఉంటోంది. దీంతో కొన్ని కంపెనీలు ఒక్కసారిగా ఉద్యోగులకు 20 శాతంపైనే వేతనాలు పెంచాయి. అయినా ఉద్యోగుల కోసం కంపెనీల మధ్య పోటీ పెరగడంతో ఒక్కో కంపెనీ ఉద్యోగులకు పాత వేతనం కంటే ఏకంగా 50 శాతం పెంచడానికి సిద్ధ పడుతున్నాయి. ఈ స్థాయిలో వేతనాలు భరించలేని చిన్న కంపెనీలు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితి తాజాగా ఐటీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కలిసి వస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే గడిచిన ఏడాదిలో లక్షకుపైగా కొత్త వారికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయని ఇటీవల రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ విడుదల చేసిన ఐటీ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే.

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ నుంచి వెనక్కి పిలిస్తే రాజీనామాలు…
కొవిడ్‌ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తయి కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఐటీ ఉద్యోగులను మళ్లిd ఆఫీసుల బాట పట్టించాలంటే ప్రస్తుతం ఐటీ కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఉద్యోగులకు ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మాని ఆఫీసులకు రమ్మంటే ఉద్యోగులు రాజీనామా చేస్తామని కంపెనీలను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశాలివ్వాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వీలుగా ఉండేందుకు ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి విధులు నిర్వహించేందుకుగాను వారికి హైబ్రిడ్‌ మోడల్‌ తరహా ఐశ్చికాన్ని కంపెనీలు ఇస్తున్నాయి. దీనికి తోడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలు కార్యాలయాలు ప్రారంభించి అక్కడికి దగ్గర్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులు అవసరమైతే ఆయా ప్రాంతాల్లోని కంపెనీల కార్యాలయాలకు వచ్చి పనిచేసుకోవాల్సిందిగా వెసులుబాటు కల్పిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు గ్లోబల్‌ డీల్స్‌ పెరిగి తద్వారా ఉద్యోగులకు డిమాండ్‌ పెరగడంతోనే వారి వలసలను తట్టుకునేందుకుగాను కంపెనీలు పలు రకాల బుజ్జగింపు విధానాలను అవలంబించాల్సి వస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement