Wednesday, May 22, 2024

ఢిల్లీ కర్తవ్యపథ్‌లో బతుకమ్మ.. కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలో తెలంగాణ పూల పండుగ ‘బతుకమ్మ’ను నిర్వహించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ సమాయత్తమైంది. ఇండియా గేట్ ఎదురుగా కర్తవ్యపథ్‌లో మంగళవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల్లో భాగంగా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని గుర్తుచేశారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజును పొరుగునే ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని, కానీ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు ఇప్పటి వరకు అధికారికంగా నిర్వహించలేదని అన్నారు.

హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చూసి సీఎం కేసీఆర్ అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. రజాకార్ల వారసత్వం కల్గిన మజ్లిస్ పార్టీ సైతం మువ్వన్నెల జెండా చేతబట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహించారంటే అది తెలంగాణ ప్రజల విజయమేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ విమోచన దినాన్ని వివిధ కార్యక్రమాలతో ఏడాదిపాటు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో భాగంగా మన సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తం చేయడంతోపాటుగా బైరాన్ పల్లి, పరకాల, నిర్మల్ వంటి చారిత్రక ఘట్టాలకు వేదికలైన ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లోనూ ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

మరోవైపు మంగళవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఢిల్లీలోని మహిళా ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల హెచ్ఓడీలకు ఆహ్వానం పంపించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రకృతితో మమేకమై జీవించాలనేది భారతీయ జీవన విధానమని, నదులను, పర్వతాలను, అడవులను, చెట్లను, మొక్కలను, పూవులను ఇలా ప్రకృతి ప్రసాదించిన ప్రతిదాన్నీ మనం ఆరాధిస్తామని బతుకమ్మ పండగ కూడా అలాంటిదేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పూవుల్లో దేవతా రూపాన్ని చూస్తూ.. ప్రకృతి ప్రసాదించిన పూవులతోనే ఆ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే మన ‘బతుకమ్మ’ పండగ, అందరూ కలిసుండాలని, కలిసి పనిచేసుకోవాలని, సమాజంతో కలిసి జీవించాలనే సందేశాన్నిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement