Friday, May 17, 2024

టీఎస్‌ఆర్టీసీ కొత్త ఆలోచన.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ బస్సులు?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) సమాయత్తమవుతోంది. దశల వారీగా అన్ని డిపోల్లో ఈ బస్సులను ప్రారంభించాలన్న నిర్ణయానికి ఆర్టీసీ యాజమాన్యం వచ్చినట్లు తెలుస్తోంది. డీజిల్‌ వినియోగం పెరుగుతుండడంతో విదేశీ మారకద్రవ్యం ఏటేటా కరిగిపోతోందని, మాదకద్రవ్య వినియోగాన్ని నియంత్రించడంతోపాటు నగరాల్లో కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులు అనివార్యమని ఆర్టీసీ భావిస్తున్నట్లు సమాచారం. డీజిల్‌ వాహనాలతో పోలిస్తే ఎల్‌పీజీ బస్సుల నిర్వహణా వ్యయం తక్కువగా ఉంటుందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతుండగా వచ్చే రెండు, మూడు నెలల్లో 300 బస్సులను కొనుగోలు చేసి హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రాలకు, తిరుపతి, విజయవాడ, కర్నూలు, బెంగళూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు నడపాలని ప్రతిపాదించింది.

వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ బస్సులనే నడిపేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బస్సుల కొనుగోలుకు బ్యాంకుల నుంచి రుణం పొందాలని, పేరెన్నికగన్న సంస్థలకు ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. డీజిల్‌ బస్సు నడిపితే కిలోమీటరుకు రూ.34నిర్వహణ వ్యయం ఉంటుందని, విద్యుత్‌ బస్సు వల్ల కిలోమీటరు కేవలం రూ.6కే నడపవచ్చని, అందుకే వీలైనన్ని ఎక్కువ రూట్లలో దశల వారీగా ఈ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

జిల్‌ ధరలు పెరుగుతుండడంతో ఆ భారం ప్రయాణికులపై వేయాల్సి వస్తోందని, అలా కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతున్న తరహాలోనే తెలంగాణలోనూ వీటిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడున్న బస్సులను గ్రామీణ ప్రాంతాలకు నడిపి జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి ఈ బస్సులను ప్రవేశపెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రవాణాశాఖపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనన్ని ఎక్కువగా ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టి ప్రజలపై వేసిన భారాన్ని తగ్గించాలని ఆయన సూచించినట్లు సమాచారం.

రవాణాశాఖలో అందిస్తున్న పౌరసేవలు, ఆన్‌లైన్‌ సేవలు, ఆర్టీసీ ఆదాయ వ్యయాలపై కూడా ఆయన అధికారులతో చర్చించారు. రవాణాశాఖలో ఆన్‌లైన్‌ సేవలను మరింత విస్తృతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రవాణాశాఖలో ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్‌ సేవలకు తోడుగా మరిన్ని సేవలను అందించాలని వీటిపై లోతుగా కసరత్తు చేయాలని మంత్రి కోరారు. ఆర్టీసీ రోజువారీ ఆదాయ వ్యయాలపై మంత్రి పువ్వాడ ప్రత్యేకంగా చర్చించారు. రవాణామంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న మంత్రి అజయ్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement