Tuesday, May 28, 2024

IPL : ఇది ప్యాట్ క‌మిన్స్ రేంజ్…

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా టీమ్ సారథి ప్యాట్ కమిన్స్‌కు తిరుగులేదు. గతేడాదిగా కెప్టెన్‌గా అతను అసాధారణ విజయాలు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ గెలిచిన కమిన్స్.. యాషెస్‌లోనూ తమ జట్టును విజేతగా నిలిపాడు.

- Advertisement -

కెప్టెన్సీతో పాటు బౌలర్‌గా, లోయరార్డర్ బ్యాటర్‌గా వ్యక్తిగత ప్రదర్శనలో దుమ్మురేపాడు. దాంతో అతనికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది. ఈ ప్రదర్శనతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కమిన్స్.. అసాధారణ సారథ్యంతో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఐపీఎల్ టైటిల్‌కు మరో రెండో అడుగుల దూరంలో నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఉప్పల్ వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యింది. దాంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 15 పాయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది.

పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే టాప్-2లో నిలిచే అవకాశం ఉంది. అయితే కేకేఆర్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాబ్‌ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌కు వచ్చిన సమస్యేలేదు. ఈ సాయంత్రం నుంచే కురిసిన భారీ వర్షంతో ఉప్పల్ మైదానం మొత్తం చిత్తడిగా మారింది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచినా.. భారీ స్థాయిలో వర్షపు నీరు చేరింది. వరణుడు కాస్త శాంతించడంతో కవర్లను తీసేసిన మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను సిద్దం చేసేందుకు తెగ కష్టపడ్డారు. వర్షపు నీరును పూర్తిగా తొలగించి చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టారు.

మైదానాన్ని ఆటకు సిద్దం చేసేందుకు దాదాపు 100 మంది సిబ్బంది శ్రమించారు. కవర్లు పూర్తిగా తీసేసి ఆటను ప్రారంభిద్దామనుకునే సమయానికి మళ్లీ వర్షం రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో హాజరైన అభిమానులు.. వర్షం కారణంగా ఇబ్బంది పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement