Wednesday, May 8, 2024

కేసీఆర్‌తో అఖిలేశ్ భేటీ.. జాతీయ రాజకీయాలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ?

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుతో శుక్రవారం మధ్యాహ్నం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ కలిశారు. మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్ సొంత పార్టీ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై సమీక్షలు జరుపుతున్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాలపై కన్నేసిన కేసీఆర్‌ను అఖిలేశ్ యాదవ్ వచ్చి కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నేతలిద్దరికీ శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్.. ఆ తర్వాత రెండు గంటల పాటు రాజకీయ చర్చలు జరిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ, అమిత్ షా  నేతృత్వంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న విధానాలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు బీజేపీని రాజకీయంగా వ్యతిరేకిస్తున్న పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరుపై నేతలు చర్చించినట్టు తెలిసింది. ప్రతిపక్షంలోని ముఖ్య నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్న అంశం భేటీలో చర్చకొచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని వరుసగా మూడు రోజుల పాటు ఈడీ ప్రశ్నించడం, పశ్చిమ బెంగాల్‌లోని మంత్రి పార్థా చటర్జీ నివాసాల్లో సోదాలు, ఢిల్లీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేంత్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం వంటి వరుస ఘటనలను నేతలు గుర్తు చేసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ గురించి నేతలిద్దరూ చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలిసి అనేకాంశాలపై చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గాలకు సంబంధించి ఐ-ప్యాక్ చేసిన సర్వే రిపోర్టును కేసీఆర్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇరువురు మరోసారి లోతుగా చర్చించినట్లు సమాచారం. ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తే విజయావకాశాలు ఎలా ఉంటాయనే విషయంపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అదే సమయంలో ఎన్నికలకు బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి మొత్తం గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంపై ఉంటుందని, ఇది టీఆర్ఎస్‌కు ఎంత వరకు కలిసొస్తుందన్న అంశంపై ప్రశాంత్ కిశోర్‌తో పాటు జాతీయ నాయకులతో కూడా చర్చించినట్లు తెలిసింది.

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్ధతు తెలిపిన టీఆర్ఎస్, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్ధతివ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అఖిలేశ్ యాదవ్‌తో జరిపిన చర్చల్లో ఈ అంశం కూడా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే, రైతు సంఘాల ప్రతినిధులను కూడా కేసీఆర్ కలవనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కేసీఆర్ మరోసారి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement