Wednesday, May 8, 2024

బీసీ బిల్లు కోసం భారీ ప్రదర్శన.. ఢిల్లీలో ఎంపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీసీ బిల్లు ఆందోళన దేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజూ కొనసాగింది. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీసీ సంఘాల నాయకులు అందులో పాల్గొన్నారు. ఓట్లు బీసీలవి – సీట్లు అగ్రకులాలకా అంటూ వారు నినాదాలు చేశారు.

అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాల కోసం ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘమేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం, బీసీల రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నా పట్టించుకోవట్లేదని కృష్ణయ్య విమర్శించారు. బీసీలను బిచ్చగాళ్లను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి సాధించేవారని ఆయన అన్నారు. కులతత్వం కనీస స్థాయికి వచ్చేదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ఎస్సీ,ఎస్టీ అట్ సిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి చట్టాలని చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement