Wednesday, May 15, 2024

నేటి సంపాదకీయం – చిత్తశుద్ధి లేని తీర్మానాలు..

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ సదస్సులు జరగడం,ఆ సదస్సుల్లో తీర్మానాలు చేయడం పరిపాటే.ఈ ఏడాది గ్లాస్గో నగరంలో జరిగిన సదస్సును బ్రిటన్‌ ప్రధాని బోరీస్‌ జాన్సన్‌ ప్రారంభిస్తూ యావత్‌ ప్రపంచం ఈనాడు అగ్నిగుండంపై ఉందని అన్నారు. వాతావరణకాలుష్యం అంతగా పెరిగి పోయిందని చెప్పడం ఆయన ఉద్దేశ్యం. కాలుష్యం పెరగడానికి,సంపన్న, అగ్రరాజ్యాలు అనుసరిస్తున్న వైఖరే కారణం. వాతావరణ సదస్సుల్లో తీసుకునే తీర్మానాలను అగ్రరాజ్యా ల్లో ఏ ఒక్క దేశమూ పాటించడం లేదు.పర్యావరణ ఉద్యమ కారిణి గ్రెటా థన్‌బర్గ్‌ చేసిన వ్యాఖ్యలను జాన్సన్‌ ఉటంకించారు అంటే పర్యావరణంపై సంపన్న దేశాల అధినేతలు తరచూ కలుసుకుని ఆమోదించే తీర్మానాల్లో, చేసే నిర్ణయాల్లో ఒక్కటి కూడా అమలు జరగదని వ్యంగంగా ఆమె బ్లా, బ్లా అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది.

కార్బన్‌ ఉద్గారాలు పెరిగిపోవడానికి పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న వైఖరే కారణమ న్న వాదనలో అసత్యం లేదు. పారిస్‌ సదస్సులో అంటే 2015లో పేద దేశాలకు పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి వంద బిలియన్‌ డాలర్ల సాయాన్నిఅందించేందుకు సంపన్న దేశాలు చేసిన వాగ్దానం నీటిమూటగానే మిగిలిపోయింది.2023 సంవత్సరం నాటికి ఈ సాయాన్ని అందించాల్సి ఉండగా, అందుకు తగిన వ్యవధి చాలా వరకూ తగ్గిపోయింది.ప్రపంచానికి ఇప్పుడు హరిత పారిశ్రామిక విప్లవం అవసరమని జాన్సన్‌ స్పష్టం చేశారు. హరిత పారిశ్రామిక విప్లవం అనేది వినడానికి బాగానే ఉంటుంది. కానీ, హరిత విప్లవాన్ని మింగేస్తున్న ప్రస్తుత పరిస్థితులు అందుకు దోహదం చేస్తాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది.పరిశ్రమలను నెలకొల్పేందుకు పచ్చని భూములను సేకరించి ప్రభుత్వమే కేటాయిస్తోంది.

ముఖ్యంగా శిలాజ ఇంధనాలు ఆధారంగా పని చేసే పరిశ్రమలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కర్బన్‌ వాయువులను విడుదల చేసే పరిశ్రమలకే అన్ని దేశాలూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనాన్ని పెంచాల్సిన అవసరం ఉందని గంభీరోపన్యాసాలు దంచేసే ప్రపంచ దేశాల నాయకులు శిలాజ ఇంధన పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
పారిస్‌ ఒప్పందంలో కుదిరినట్టుగా ఉద్గారాల ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కి పరిమితం చేయకుంటే చైనాలోని షాంఘై నగరం, అమెరికా లోని మియామీ వంటి ప్రాంతాలు సముద్రం పాలవుతాయని జాన్సన్‌ హెచ్చరించారు. సరిగ్గా ఆరేళ్ళక్రితం పారిస్‌ సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఆ హెచ్చరికలను పాటించాల్సినదేశాలే అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల్లో ఇలాంటి హెచ్చరికలు చేసేసి తమ బాధ్యత తీరిందని భావిస్తున్నాయి. అమెరికాలో తరచూ కార్చిచ్చులు,తుపానులు ఉత్పన్నమవుతున్నాయి.

ఎన్ని ఉపద్రవాలు సంభవించినా తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకోవడం తప్ప వాతావరణ సమతూక స్థితిని కాపాడేందుకు సంపన్న దేశాలు ఏ ఒక్క చర్యను తీసుకోవడం లేదు. పెద్దదేశాల పరిస్థితే ఇలా ఉంటే చిన్న, సామాన్య దేశాలు ఉద్గారాల తగ్గింపు కోసం కోట్లాది డాలర్లను ఎలా కేటాయించగలవు?పర్యావరణ పరిరక్షణ కోసం కోట్లాది డాలర్ల నిధులను కేటాయించగల సామర్ధ్యం కలిగిన సంపన్న దేశాలే ఈ విషయంలో జాప్యం చేస్తున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పిలుపు ప్రాతిపదికగా పారిస్‌ ఒప్పందం రూపుదిద్దుకుంది. ఆయన తర్వాత అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన ట్రంప్‌ బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలను మూసివేయడం కుదరదని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు.

మరో అడుగు ముందుకు వేసి పారిస్‌ ఒప్పదం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్‌ పారిస్‌ ఒప్పందాన్ని గౌరవిస్తానని ప్రకటించినప్పటికీ అందుకు తగిన కార్యాచరణ ప్రకటించలేదు. అగ్రరాజ్యాల తీరు ఇలా ఉండగా,అంతర్జాతీయ ఒప్పందాలు ఎలా అమలు జరుగుతాయ న్న థన్‌బర్గ్‌ వంటి ఉద్యమకారుల ప్రశ్న సహేతుకమైనదే.అయితే,ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఇలాంటి సదస్సులు జరగడం, వాటిలో తీర్మానాలు చేయడం మొక్కుబడి గానే మిగిలిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement