Thursday, May 2, 2024

నేటి సంపాద‌కీయం – ప్ర‌ధాని వ‌దిలిన పెట్రో బాంబ్.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇంతకాలం మౌనం పాటిస్తూ వచ్చిన ఒక అంశంపై బుధవారం నోరు విప్పు తూనే ఘాటుగా స్పందించారు.పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కేంద్రమే కారణమంటూ ఇంత కాలం ప్రతిపక్షాలు,అవి అధికారంలోఉన్న రాష్ట్రాలూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నా ఇంతవరకూ నోరు మెద పలేదు. ఇప్పుడు తగిన సమయాన్ని చూసుకుని ధరల తగ్గించడంలో కేంద్రమూ, రాష్ట్రాలు రెండింటికీ సమా నబాధ్యత ఉందనీ,కేంద్రం తన వంతుగా పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) తగ్గించలేదనీ, ధరలు పెరగడానికి అదే కారణమని అన్నారు. ఈ విషయం చాలా కాలంగా వినిపిస్తున్న మాటే కానీ, ప్రధానమంత్రి నోటంటరావడంవల్ల అధికారికం అయింది. పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టి) పరిధిలో చేర్చాలన్న డిమాండ్‌ చాలాకాలంగా వస్తున్నా, దీనిపై కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ స్పందించడం లేదు. జీఎస్‌టి ద్వారా వచ్చే ఆదాయంలో కేంద్రం రాష్ట్రాలకు పరిహారం రూపంలో సాయమందించేందుకు ఈ పథకం అమలు చేసే ముందు కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, కేంద్రం అందిస్తున్న సాయం తమ రాష్ట్రాల నుంచి వసూలు అయ్యే జీఎస్‌టి ఆదాయం దామాషాకు సరిపడినట్టుగా లేదనీ, ఈ విషయంలో కేంద్రం తమకు అన్యాయం చేస్తోందని పెక్కు రాష్ట్రాలు ఇప్పటికే ఆరోపించాయి. కేంద్రంలో కాంగ్రెస్‌ లేదా. కాంగ్రెస్‌ కూటమి (యూపీఏఎ) అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు తగిన వాటా రావడం లేదని ఆరోపించేవి. అప్పుడు ఈ ఆరోపణలు చేయడంలో బీజేపీ ముందుండేది. దివంగత అరుణ్‌ జైట్లీ రాజ్య సభలో ఈ అంశాన్ని పలు సార్లు ప్రస్తావించారు. కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాలకు రావల్సిన వాటా సక్రమమైన రీతిలో అందడం లేదన్న ఆరోపణ ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వారు చేస్తున్నారు.

నరేంద్రమోడీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర రాబడిలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచినట్టు ఘనంగా కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్ర పథకాలకు అంత కుముందు ఇచ్చిన నిధుల్లో కత్తిరింపులు చేసిందని కేంద్రంపై బీజేపీయేతర పక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్‌ శాతాన్ని తగ్గించకపోవడం వల్లనే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడం లేదంటూ ప్రధానమంత్రి స్వయంగా ఆరోపించడం కేంద్రం, రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి తెర లేచినట్టయింది. వ్యాట్‌ పన్ను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తగ్గించడం సాధ్య మైనప్పుడు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తగ్గించడానికి ఎందుకు వెనుకాడుతున్నా యన్నప్రశ్న జనంలోఎదురవుతోంది. అయితే, కేంద్రం నుంచి రావల్సిన నిధులు సకాలంలో రాకపోవడం వల్ల లేదా, గతంలోకన్నా తగ్గి పోవడం వల్ల రాష్ట్రాలు వ్యాట్‌ రాబడిపైనే ఆధారపడుతున్నాయి. ఈవిషయాన్ని పలు రాష్ట్రాలు స్పష్టం చేయడం జరిగింది.

అంతేకాకుండా, ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలకు గతంలో మాదిరి నిధులు కేటాయించడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో పనికిఆహార పథకం నిధులను ఎక్కువ అంచనాలను సమర్పించి పొందాయనీ, వాటిని దుర్వినియోగం చేశాయనీ, అలాంటివి జరగకుండా చూసేందుకే గ్రామీణ ఉపాధి పథకం నిధులపై పర్యవేక్షణ జరుపుతున్నామంటూ కేంద్రం వివరణ ఇచ్చింది. అలాగే, పెట్రోలియం ఉత్పత్తుల కోటా విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం ప్రతి పక్షాలు అధికారంలోఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపు తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కేంద్రమూ, రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాసం, అవగా హన ఉన్నంత కాలం ఇలాంటివన్నీ సర్దుకుని పోతాయి. అయితే, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రాలకు రావల్సిన నిధులు, ఆహార ధాన్యాలు, పెట్రోలియం నిల్వల విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించేదనీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఎప్పటి కప్పుడు పెంచుతూ కేంద్రం ఇప్పటికి 26 లక్షల కోట్ల రూపాయిలను సంపాదించిందనీ, అందులో రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా, రాష్ట్రాలు వ్యాట్‌ శాతాన్ని తగ్గించు కోవాలనడం ఏపాటి న్యాయమని కాంగ్రెస్‌లో కీలక నేత పవన్‌ ఖేరా వ్యాఖ్యానించారు. ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ప్పుడు కూడా కేంద్రం అదే ధరను వసూలు చేస్తోందని ఆయన అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై కేంద్రమూ, రాష్ట్రాలూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలూ సమష్టిగా ఆలోచించి ప్రజలకు మేలు చేసినప్పుడే శ్రేయో రాజ్యమనిపించుకుంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement