Sunday, April 28, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 19 (ఆడియోతో…)

పద్మ పురాణంలో ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

అమృతోదధివత్‌ సర్వై: భజ్య మానోపి సర్వదా
అధో నక్షీయతే జాతు యస్మాత్‌ తస్మాత్‌ అధోక్షజ:

మందర పర్వతాన్ని పడవేసి, వాసుకిని తాడుగా చేసి దేవతలు, దానవులు కలసి సముద్రాన్ని ఎంత చిలికినా ఏ మాత్రము అందులోని నీరు తరగదు, పర్వతము కిందికి జారదు, తనను చిలుకుతున్న దేవదానవులను సముద్రన ముంచదు. అలాగే అనంత కోటి బ్రహ్మాండాలలో ఉన్న అనంతకోటి జీవరాశులు నిరంతరం అధోక్షజ అనగా శ్రీమన్నారాయణుడిని సేవిస్తున్నా, యాచిస్తున్నా, ద్వేషిస్తున్నా, పీడిస్తున్నా ఏమాత్రం కిందకు జారడు కావున అతనిని అధోక్షజ: అంటారు.

వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో అధోక్షజ అను నామానికి అర్థాన్ని ఈ విధంగా వివరించాడు.అధోక్షజను ‘అధ: అక్ష జ’ అని మూడుగా విడదీస్తే ‘అధ ‘అనగా క్రిందుగా, ‘అక్ష’ అనగా జారదు, ‘జ’ అనగా కలుగుతుంది, నిలుపుతుందని అర్థం. క్రిందికి జారకుండా ఉంటుంది, తనను కోరిన వారందరిని కలుపుతుంది, తన పై భక్తిని, ఎదుటి వారిపై స్నేహాన్ని నిలుపుతుంది. ఇలా క్రిందకు జారని వాడు, కలిపే వాడు, నిలిపేవాడని అధోక్షజ అను నామానికి అర్థం.

భాగవతానుసారం.. అధోక్షజ అన్న నామానికి ‘అక్షజాన్‌ అధ: కరోతి ఇతి అధోక్షజ:’ అని అర్థము వివరించారు. అక్ష అనగా ఇంద్రియములు, జ అనగా కలిగేవి.
అక్షజా అనగా ఇంద్రియముల వలన కలిగే ప్రవృత్తులను అనగా పనులను తగ్గించేవాడు. ఇంద్రియములను, ఇంద్రియ వ్యాపారములను తన ఆధీనంలో ఉంచుకొని వాటిని నియంత్రించేవాడని ‘అధోక్షజ’ అను శబ్ధానికి అర్థం. భగవంతుని నామాన్ని తలచుకునే కాకుండా నామాన్ని పలికేటప్పుడు ఆ పేరులోని అర్థాన్ని తెలుసుకుని ఆ రసాన్ని అనుభవించిన వాడు నామ సంకీర్తనాన్ని విడిచిపెట్టడు.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement