Friday, April 26, 2024

అంబేద్కర్‌ స్టెడీ సెంటర్ల పునఃప్రారంభం, విశాఖ, తిరుపతి, విజయవాడలో ఏర్పాటు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలో అంబేద్కర్‌ స్టెడీ సెంటర్లను తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. వీటిలో తిరుపతి కేంద్రంలో బ్యాంకింగ్‌ పరీక్షలకు, విశాఖ, విజయవాడ కేంద్రంలో గ్రూప్‌-1, 2, కోచింగ్‌ ఇవ్వడానికి అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఏపీ ఆన్‌ లైన్‌ ద్వారా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నామని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. స్టెడీ సెంటర్లలో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రొఫెసర్ల స్థాయిలో అధ్యాపకులకు ఎంపిక చేయాలని మంత్రి నాగార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఉప ప్రణాళికపై మంత్రి సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి మేరుగు అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఉప ప్రణాళికకు సంబంధించిన నిధులు అన్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా ఎస్సీలకు మేలు జరిగేలా చూడాలని కోరారు.

ముందుగా ఎస్సీ సబ్‌ ప్లాన్‌, సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఎస్సీ కార్పొరేషన్‌ తదితర విభాగాలకు చెందిన వివిధ పథకాలను గురించి సమావేశంలో మంత్రి నాగార్జున నిశితంగా సమీక్షించారు. వివిధ పథకాల అమలుతీరును గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేయాల్సిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో వెనుకబడిన ప్రభుత్వ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, నిధులు వృధా కాకుండా చూడాలని కోరారు. ఈ విషయంగానే ప్రధాన ప్రభుత్వశాఖల అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హాస్టళ్లకు, గురుకులాలకు సంబంధించిన భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఎస్సీ కార్పొరేషన్‌ పథకాల్లో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. పథకాల మంజూరులో మధ్యదళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కే. హర్షవర్ధన్‌ తో పాటు-గా వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement