Saturday, December 7, 2024

ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం.. మ‌న బలం మరింత పెరిగింది: రాజ్‌నాథ్‌సింగ్‌

భారత తొలి ‘స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్’ ఐఎన్ఎస్ విశాఖపట్నం ఈరోజు జ‌ల ప్ర‌వేశం చేసింది. ముంబ‌యిలో జ‌రిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు నౌకాదళ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడారు. అంత‌కుముందు రాజ్‌నాథ్ సింగ్ అధికారులతో కలిసి ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలను పరిశీలించారు. ఈ యుద్ధ నౌక‌ రాకతో హిందూ మహాసముద్రంలో నౌకదళంలో భారత్‌ బలం మరింతగా పెరిగిందన్నారు. భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలనుకునే దేశాలకు తగిన గుణపాఠం చెబుతామని చైనాను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు రాజ్‌నాథ్ సింగ్.

అంతర్జాతీయ సరిహద్దులను ఉల్లంఘిస్తూ.. సముద్రజలాల ఆక్రమణకు పాల్పడుతున్న‌ దేశాలకు భారత్ క‌చ్చితంగా బుద్ధి చెబుతుందన్నారు భారత ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. అంతర్జాతీయ సరిహద్దులను ఉల్లంఘించొద్దని, ఉల్లంఘిస్తే భారత్ దీటైన సమాధానం చెబుతుందన్నారు. కాగా, ప్రాజెక్టు 15బీ పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతన నౌకలను తయారు చేస్తున్నారు. ముంబయి మజగాన్ డాక్‌లో ఈ నౌకను నిర్మించారు. నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ నౌకకు ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’గా నామకరణం చేశారు.

ఐఎన్ఎస్‌ విశాఖ‌ప‌ట్నం స్పెషాలిటీస్‌..
ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు అస్స‌లు గుర్తించలేవు. దీనికోసం లేటెస్ట్ టెక్నాల‌జీని ఉపయోగించారు. రెండు మల్టీరోల్ హెలీకాప్టర్లు కూడా ఇందులో ఉంటాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్స్‌తో సహా పలు రకాల మైస్సైల్స్‌ని ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు. జలాంతర్గాములను కూడా ఇది గుర్తించి దాడి చేయగలదు. తీర నౌకదళంలో గస్తీతో పాటు కఠినమైన పరిస్థితుల్లో యుధ్దనౌకగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement